- ఏపీ హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు
- కేంద్ర ఉద్యోగులపై సీబీఐ అవినీతి కేసు పెట్టొచ్చు
- ఉద్యోగులు ఏ రాష్ట్రంలో పని చేసినా.. కేంద్ర పరిధిలోకే వస్తారని తీర్పు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై కేంద్ర అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ కేసు నమోదు చేయవచ్చని, ఇందుకు ఆ ఉద్యోగులు పని చేస్తున్న రాష్ట్రాల్లోని ప్రభుత్వాల అనుమతి తీసుకోనవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కేంద్ర ఉద్యోగులు ఏ రాష్ట్రంలో పని చేస్తున్నా వారు కేంద్రం పరిధిలోకే వస్తారని, కేంద్ర అవినీతి నిరోధక చట్టం కింద నేరాలకు పాల్పడితే వారిపై సీబీఐ విచారణ చేపట్టవచ్చని స్పష్టం చేసింది. ఏపీలో పని చేస్తున్న ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను ఏపీ హైకోర్టు గతంలో కొట్టివేసింది. దీనిపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై గురువారం సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ సీటీ రవికుమార్, జస్టిస్ రాజేశ్ బిందాల్‌ల బెంచ్ తీర్పు చెప్పింది. సాధారణంగా ఆయా రాష్ట్రాల్లో కేసులను దర్యాప్తు చేసేందుకు సీబీఐకి సంబంధిత రాష్ట్రాల ప్రభుత్వాలు జనరల్ కన్సెంట్(అనుమతి)ని ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే, ఉమ్మడి ఏపీలో 1990లో అప్పటి ప్రభుత్వం సీబీఐకి జనరల్ కన్సెంట్ను ఇచ్చిందని, రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఏపీ సర్కారు కన్సెంట్ ఇవ్వలేదన్న పిటిషనర్ల వాదనను గతంలో ఏపీ హైకోర్టు సమర్థించింది. విభజన తర్వాత ఏపీ సర్కారు కన్సెంట్ ఇవ్వనందున ఈ కేసును దర్యాప్తు చేసే పరిధి సీబీఐకి లేదని తీర్పు చెప్పింది. ఈ విషయంలో హైకోర్టు అభిప్రాయంతో సుప్రీం బెంచ్ విభేదించింది. సీబీఐ దర్యాప్తునకు తాజా కన్సెంట్ అవసరం లేదంది. ఉమ్మడి ఏపీలో ఉన్న అన్ని చట్టాలు, నిబంధనలూ.. రాష్ట్ర విభజన తర్వాత కూడా రెండు రాష్ట్రాలకు వర్తిస్తాయని 2014, మే 26న జారీ చేసిన సర్క్యులర్ మెమోలో స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేసింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఆ చట్టాలను సవరించేంత వరకు లేదా రద్దు చేసేంత వరకూ అవి కొనసాగుతాయని స్పష్టం చేసింది.