సమగ్ర కుటుంబ సర్వే దేశానికి ఆదర్శం : కొండా సురేఖ

 సమగ్ర కుటుంబ సర్వే  దేశానికి ఆదర్శం : కొండా సురేఖ
  • ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం
  • దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ 

పటాన్​చెరు, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సంగారెడ్డి జిల్లా చిట్కుల్ గ్రామంలో ప్రారంభించారు.   గ్రామంలోని డా. బీఆర్‌‌ అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ..   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే- బీసీ కులగణన దేశానికే ఆదర్శమన్నారు. 

ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేకు శ్రీకారం చుట్టిందన్నారు.  కాంగ్రెస్ నేత నీలం మధు మాట్లాడుతూ..   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే దేశానికే రోల్ మోడల్ అని కొనియాడారు.  సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, చీఫ్​ ప్లానింగ్​ ఆఫీసర్​ బాలశౌరి, పటాన్ చెరు తహసీల్దార్ రంగారావు, ఎంపీడీవో యాదగిరి, ఎంపీవో హరి శంకర్ గౌడ్, చిట్కుల్ ఈఓ కవితతో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. 

గీత  కార్మికులకు కాటమయ్య కిట్ల పంపిణీ 

సంగారెడ్డి టౌన్ , వెలుగు: కులవృత్తులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని రాష్ట్ర జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ, వైద్య  ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో గీత కార్మికులకు కాటమయ్య కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జహీరాబాద్ , మెదక్ పార్లమెంటు పరిధిలోని లబ్ధిదారులకు 60 కిట్లను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ..   ప్రభుత్వం ఉచితంగా కాటమయ్య కిట్లను పంపిణీ చేస్తోందన్నారు. సంగారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో టీఎస్ ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి , సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి జగదీశ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్  నవీన్ చంద్, కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు ఆశన్న గౌడ్, కార్యదర్శి రమేశ్ గౌడ్,  గౌడ సంఘం నాయకులు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.