సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాను క్రీడల హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. శుక్రవారం సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ వెంకట్‌రావు, డీఈవో అశోక్‌తో కలిసి 155 ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, మోడల్ స్కూళ్లకు స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో పిల్లలు క్లాస్, హాస్టల్ రూములకు పరిమితం కావడంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు. కొందరు ఆత్మహత్యలు చేసుకోవడానికి క్రీడా స్ఫూర్తి లేకపోవడమే కారణమన్నారు.
స్టూడెంట్లు సెల్, టీవీలు వదిలేసి క్రీడలపై ఫోకస్ చేయాలని సూచించారు. ఇటీవల నియోజక వర్గంలో నిర్వహించిన క్రీడల్లో 27 వేల మంది మహిళలు పాల్గొనడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో వాసవీ వనిత క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సీమంతాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా 104 మంది గర్భిణులకు చీరలు, పండ్లు, పూలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పల లలితా ఆనంద్, నేతలు ఉప్పల ఆనంద్, గుండా శ్రీదేవి, రాచకొండ శ్రీనివాస్, చల్లా లక్ష్మీకాంత్, రాచర్ల కమలాకర్, తోట శ్యామ్, లక్ష్మీ, వెంపటి సురేశ్, తదితరులు పాల్గొన్నారు.
కోదాడలో మళ్లా గులాబీ జెండా ఎగరవేస్తాం
కోదాడ, వెలుగు: కొదాడలో ఈ సారి కూడా గులాబీ జెండా ఎగరవేస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌తో కలిసి 294 మంది బీసీలకు రూ.లక్ష సాయం చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో 300 మందికి రూ. లక్ష చొప్పున సాయం అందజేస్తామని చెప్పారు. తెలిసో తెలియకో 2014లో కాంగ్రెస్ ను గెలిపించిన కోదాడ ప్రజలు 2018లో బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వడంతోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు.
పదవుల కోసం ప్రజలను తాకట్టు పెట్టిన చరిత్ర ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులదని ఎద్దేవా చేశారు. వారి పాలనలో సాగర్ ఆయకట్టుకు ఏనాడు మూడు పంటలకు నీళ్లు ఇవ్వలేదన్నారు. ఈ కార్యాక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ గుజ్జా దీపిక యుగంధర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ, ఎంపీపీ చింతా కవిత రాధా రెడ్డి, వైస్ చైర్మన్ వెంపటి పద్మ, రైతుబంధు అధ్యక్షుడు సుంకర అజయ్ కుమార్, అనంతగిరి ఎంపీపీ వేంకటేశ్వర రావు, కౌన్సిలర్ కల్లూరి పద్మజ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చండు నాగేశ్వర రావు పాల్గొన్నారు.