చివరికి చేరని ఎస్సారెస్పీ

 చివరికి చేరని ఎస్సారెస్పీ

 

  • ఆయకట్టుకు సరిపడా సాగునీరందక ఎండుతున్న పంటలు
  • అడుగంటుతున్న భూగర్భ జలాలు  
  • వారబందీతో రైతుల ఇక్కట్లు  

సూర్యాపేట, వెలుగు : ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు పొలాలకు సాగునీరు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల పంటలు ఎండిపోవడంతో పశువులకు మేతగా వదిలేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఆదిలోనే చేతి కందకుండాపోతుంది. వేసవికి ముందే ఎండలు మండిపోతుండడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. చివరి భూములకు గోదారి జలాలు విడుదల చేయాలంటూ రైతులు ఆందోళన బాట పడుతున్నారు. 

ఆయకట్టుకు సరిపడా అందని నీరు..

ఎస్సారెస్పీ స్టేజ్ –2 ఆయకట్టు కింద ఉన్న భూములకు సరిపడా నీటిని విడుదల చేయడం లేదు. వారబందీ విధానంలో నీటిని విడుదల చేస్తున్నా అవి చివరి ఆయకట్టు వరకు చేరడం లేదు. విడుదలవుతున్న నీరు కేవలం ప్రధాన కాల్వల్లో మాత్రమే ప్రవహిస్తోంది. డీబీఎం-69 కింద 28 ఉపకాల్వలు, డీబీఎం-70 కింద 11 ఉప కాల్వలు, డీబీఎం-71 కింద 75 ఉప కాల్వలు ఉన్నాయి. ప్రస్తుతం వస్తున్న గోదావరి జలాలు ఎక్కడా ఉప కాల్వల్లోకి వెళ్లడం లేదు. అయితే కేవలం ఆయకట్టు కింద 60 వేల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. 

గతంలో రోజుకు 1800 నుంచి 2 వేల క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేసేవారు. దీంతో మూడు, నాలుగు రోజుల్లోనే చివరి ఆయకట్టు వరకు నీరు చేరేది. ప్రస్తుతం అధికారులు 1400 క్యూసెక్కులకు మించి నీటిని విడుదల చేయడం లేదు. దీంతో ఏ డీబీఎంలోనూ చివరి ఆయకట్టుకు సాగునీరు వెళ్లడం లేదు. గోదావరి జలాలు విడుదల చేసి రెండు నెలలు అవుతున్నా నేటికీ డీబీఎం-71 పరిధిలోని పెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పహాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మోతె, నడిగూడెం, మునగాల మండలాల చివరి భూములకు నీరు చేరలేదు. 

జిల్లాలో 2.20 లక్షల ఎకరాల ఆయకట్టు..

ఎస్సారెస్పీ రెండో దశ ఆయకట్టు కింద సూర్యాపేట జిల్లాలో 2.20 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ భూములకు నీరందించేందుకు 69,70,71 డీబీఎం(డిస్ట్రిబ్యూటరీ మేజర్లు)లను ఏర్పాటు చేశారు. ఇందులో డీబీఎం-69 కింద తిరుమలగిరి, తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలాల పరిధిలో 27 కిలో మీటర్ల కాల్వ విస్తరించి ఉంది. ఈ డీబీఎం కింద సుమారు 60 వేలకు పైగా ఎకరాల ఆయకట్టు ఉంది. 

డీబీఎం-70 కింద నాగారం, తిరుమలగిరి మండలాల పరిధిలో 9 కిలోమీటర్ల మేర కాల్వ, సుమారు 7 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. డీబీఎం-71 పరిధిలో తిరుమలగిరి, అర్వపల్లి, నాగారం, సూర్యాపేట, పెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పహాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆత్మకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), మునగాల, నడిగూడెం, మోతె మండలాల్లో సుమారు 70 కిలోమీటర్ల మేర కాల్వ విస్తరించి ఉంది. ఈ డీబీఎం కింద అత్యధికంగా 1.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.

వారబందీతో రైతుల ఇక్కట్లు.. 

ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేస్తుండడంతో చివరి భూములకు నీరందక పంటలు ఎండిపోతున్నాయి. మరోవైపు బోర్లను నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న రైతులకు గత 10 రోజుల నుంచి ఎండ తీవ్రత పెరగడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. కొన్నిచోట్ల రోజంతా బోర్లు నడిచినా ఎకరం పొలం కూడా తడవని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చివరి భూములకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.  

నీళ్లు వస్తాయని నాలుగు ఎకరాల్లో నాటు పెట్టా.. 

ఎస్సారెస్పీ నీళ్లు వస్తాయని నమ్మకంతో నాలుగు ఎకరాల్లో వరి వేశాను. పూర్తిస్థాయిలో నీరు అందక పంట ఎండిపోయింది. అప్పులు తెచ్చి వరి నాటు వేసి పూర్తిగా నష్టపోయాను. ఎలాగైనా తమను ప్రభుత్వమే ఆదుకోవాలి. - పోతరాజు వీరాస్వామి, రైతు, వెంకపల్లి గ్రామం, నూతనకల్​ మండలం