
గ్రామాల్లో ప్రతీ బుధవారం నిర్వహణ
సూర్యాపేట, వెలుగు: మారుమూల ప్రాంతాల ప్రజలకు పోలీసు శాఖను చేరువ చేసేందుకు ఎస్పీ నరసింహ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామీణులను సన్మార్గంలో నడిపించడం కోసం ప్రతీ బుధవారం పోలీస్ ప్రజా భరోసా పేరిట అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి సూర్యాపేట జిల్లాలో పోలీస్ప్రజా భరోసాను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతీ బుధవారం ఒక్కో పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక గ్రామాన్ని ఎంచుకొని, డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ ఈ కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పారు. తాను కూడా ప్రతీ వారం ఏదో ఒక గ్రామంలో హాజరవుతానన్నారు.
మొదటి రోజు సూర్యాపేట టౌన్‌లోని రాజీవ్ నగర్, చివ్వెంల మండలం ఎంజీ నగర్ తండా, నాగారం మండలం వర్థమానుకోట, మద్దిరాల మండలం గుమడవెల్లి, మునగాల మండలం కలకోవ, కోదాడ టౌన్‌లోని లక్ష్మీపురం, మేళ్లచేరువు మండలంలోని -వేపలమాదరం, గరిడేపల్లి - మండలం పోనుగోడులో నిర్వహించినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పడమే పోలీస్ ప్రజా భరోసా ఉద్దేశమన్నారు. నేరాల్లో చిక్కుకుంటే యువత భవిష్యత్తులో ఉద్యోగాలు పొందడంలో, విదేశాలకు వెళ్లడం, పైచదువుల విషయంలో సమస్యలు వస్తాయని చెప్పారు.
తప్పు చేసినవారిలో మార్పు తీసుకురావాలి
మునగాల, వెలుగు: తప్పు చేసినవారిలో మార్పు తీసుకురావాలని ఎస్పీ నరసింహ అన్నారు. కలకోవ గ్రామంలో బుధవారం రాత్రి నిర్వహించిన పోలీస్ప్రజా భరోసా కార్యక్రమానికి హాజరై, మాట్లాడారు. గ్రామ చరిత్ర పోలీస్ స్టేషన్రికార్డుల్లో ఉంటుందని, పౌరులు చట్టాలకు లోబడి నడుచుకోవాలని సూచించారు. క్షణికావేశంలో నేరాలకు పాల్పడి, జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పారు. సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ ప్రవీణ్‌కుమార్, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.