- 20 శాతం మాత్రమే చేరుకున్న వానాకాలం టార్గెట్
- జీరో పర్సెంట్ దగ్గరే యాసంగి సీజన్ సీఎమ్మార్
- ఆగస్టులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశం
- రేషన్ బియ్యం దందా మొదలుపెట్టిన మిల్లర్లు
సూర్యాపేట, వెలుగు: సీఎమ్మార్ కింద కేటాయించిన ధాన్యాన్ని ఏపీకి తరలించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మిల్లర్లు దాని భర్తీకి పీడీఎస్ దందా మొదలు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూర్యాపేటలో వానాకాలం సీజన్‌లో కేవలం 20 శాతం టార్గెట్ చేరుకోగా.. యాసంగి సీఎమ్మార్ ఇంకా మొదలు పెట్టలేదు. లక్ష్యం చేరుకోవాలని అధికారులు ఎంత ప్రయత్నిస్తున్నా మిల్లర్లు సహకరించడం లేదు. దీంతో కలెక్టర్ వెంకట్‌రావు రెండు రోజుల కింద మీటింగ్ పెట్టి ఆగస్టు చివరి నాటికి సీఎమ్మార్‌ను ఎఫ్‌సీఐకి అప్పజెప్పాలని ఆదేశించారు. అయితే ధాన్యం మిల్లింగ్ చేయకుండా అధికారులు తనిఖీల పేరిట తమను ఇబ్బందులు పెడుతున్నారని, ఆలోగా ఇవ్వలేమని మిల్లర్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ సీఎమ్మర్ సేకరణ పర్యవేక్షణ కోసం ప్రత్యేక ఆధికారులను నియమించారు. గడువులోగా ఎఫ్‌సీఐకి అప్పజెప్పకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పీడీఎస్ దందా షురూ!
గడువులోగా సీఎమ్మర్ అందించాలని కలెక్టర్ ఆదేశించడంతో సీఎమ్మార్ లోటును భర్తీ చేసేందుకు మిల్లర్లు పీడీఎస్ దందాకు తెర లేపినట్లు తెలుస్తోంది. పక్క రాష్ట్రాలు, జిల్లాల నుంచి రేషన్, క్వాలిటీ లేని బియ్యాన్ని తీసుకొచ్చి సీఎమ్మార్ కింద ఎఫ్‌సీఐకి అప్పజెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే 24 శాతం కంటే ఎక్కువ నూకలు ఉంటుండంతో ఎఫ్‌సీఐ అధికారులు రిజెక్ట్ చేస్తున్నారు. దీంతో కొందరు అధికారులతో కుమ్మక్కై సివిల్ సప్లయ్ కార్పొరేషన్‌కు అప్పగిస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఓ ప్రజాప్రతినిధికి సంబంధించిన మిల్లులో భారీగా పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
నిల్వలపై అనుమానాలు
జిల్లాలో సీఎమ్మర్ నిల్వలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పలువురు మిల్లర్లు అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో గత సీజన్‌లో బ్లాక్ లిస్టులో పెట్టారు. కానీ, అధికారులు వారికి కూడా సీఎమ్మర్ కేటాయించడంతో ధాన్యం పక్కదాని పట్టించారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల గడ్డిపల్లి మిల్లు నుంచి భారీ ఎత్తున ఏపీకి తరలిస్తున్న ధాన్యం పట్టుడిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఈ మిల్లుతో పాటు మరో ఏడు మిల్లుల్లో కూడా ధాన్యాన్ని మాయం చేసినట్లు పట్టుబడ్డ బ్రోకర్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఆ ఏడు మిల్లులలో తనిఖీలు చేస్తే నిల్వలు ఉన్నాయో.. లేవో..? తెలుస్తుంది. కానీ, అధికారులు టెక్నికల్ టీమ్ పేరుతో అలసత్వం వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పట్టుబడ్డ గడ్డిపల్లి మిల్లులో ఎంత ధాన్యం తరలించారనే విషయం ఇప్పటికే తేల్చకపోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
సీఎమ్మార్ సూర్యాపేట లాస్ట్
సీఎమ్మార్ సూర్యాపేట జిల్లా రాష్ట్రంలో చివరి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. గత వానాకాలం సీజన్‌లో జిల్లాలో 2,10,431 మెట్రిక్ టన్నులు కేటాయించగా.. దాదాపు 50 వేల మెట్రిక్ టన్నులు(20 శాతం) టార్గెట్ మాత్రమే చేరుకున్నారు. యాసంగి సీజన్ సంబంధించి 2,46,569 మెట్రిక్ టన్నులను కేటాయించగా ఇప్పటి వరకు ఒక్క శాతం కూడా చేరుకోలేదు. అదే నల్గొండ జిల్లాలో వానాకాలం సీజన్ 2,98,459 మెట్రిక్ టన్నులు ఇవ్వగా.. 2,02, 653 మెట్రిక్ టన్నులు(65 శాతం), యాదాద్రి జిల్లాలో 1,91, 429 టార్గెట్ కాగా.. ఎఫ్‌సీఐకి 1.05 లక్షల మెట్రికట్ టన్నులు(46శాతం) ఎఫ్‌సీఐకి చేరింది.