సూర్యాపేట జిల్లాలో వరుస చోరీలు.. ముగ్గురి అరెస్టు

సూర్యాపేట జిల్లాలో  వరుస చోరీలు.. ముగ్గురి అరెస్టు
  • బంగారం, రూ. లక్ష స్వాధీనం 

సూర్యాపేట, వెలుగు: వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు.  మొత్తం 7 కేసుల్లో రూ.5 లక్షల విలువైన 9 తులాల బంగారం, రూ.లక్ష, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. గత నెల 21న గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకవీడు మండలాల్లో తాళం వేసిన ఇళ్లలో చల్లా సురేశ్, బత్తుల రాజు  చొరబడి, బంగారం, వెండి ఆభరణాలు, డబ్బులు దొంగిలించారు. 

ఆభరణాలను గుంటూరుకు చెందిన చింత నాగేశ్వరరావు వద్ద కుదువ పెట్టారు.  మంగళవారం గరిడేపల్లిలో బైక్ పై వెళ్తూ పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించారు.  అదుపులోకి తీసుకొని, విచారించగా చోరీలు చేసినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి రూ.3.5 లక్షల విలువైన 7.3 తులాల బంగారం, రూ.87 వేలు రికవరీ చేశారు. మరో కేసులో హుజూర్ నగర్ పట్టణానికి చెందిన మహమ్మద్ షబ్బు ఫ్లవర్ డెకరేషన్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని వద్ద పనిచేసే  భీమిశెట్టి ప్రదీప్ ఈ నెల 7న  బీరువాలోని 17 గ్రాముల గోల్డ్​ చైన్, రూ.14 వేలు దొంగిలించాడు. అనుమానంతో షబ్బు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వారు ప్రదీప్ ను అదుపులోకి తీసుకొని, విచారించారు. దీంతో అతను నేరం అంగీకరించాడు.  చైన్​తోపాటు డబ్బులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. 

గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు..

కోదాడలో  గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. నింది తుల నుంచి  రూ.లక్ష విలువైన 9.860 కేజీల గంజా యి, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.

 ఆంధ్ర ప్రాంతానికి చెందిన కృష్ణచైతన్య, తేజ, సంపత్ కుమార్, వీరభాస్కరరావు, నరసింహ సాయి, వెంకట వంశీ, ఆనంద్ ఆంధ్ర–ఒడిశా బార్డర్ నుంచి గంజాయిని తక్కువ ధరకు తీసుకువచ్చి, హైదరాబాద్​లో విక్రయించేవారు. మంగళవారం విజయవాడ నుంచి హైదరాబాద్​బస్సులో వెళ్తూ కోదాడ శివారులోని దుర్గాపురం క్రాస్ రోడ్ వద్ద దిగారు. రోడ్డు పక్కనున్న మామిడి తోటలో గంజాయి విక్రయిస్తున్నట్లు కోదాడ పోలీసులకు సమాచారం వచ్చింది. కృష్ణచైతన్య, తేజ, సంపత్ కుమార్, వీరభాస్కరరావు, నరసింహ సాయిలను అరెస్టు చేశారు. వెంకట వంశీ, ఆనంద్ పరారైనట్లు ఎస్పీ తెలిపారు.  

బైక్​లు చోరీ చేస్తున్న వ్యక్తి..  

యాదాద్రి, వెలుగు: బైక్​లు చోరీ చేస్తున్న వ్యక్తిని భువనగిరి టౌన్​ పోలీసులు అరెస్టు చేశారు. 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీఐ సురేశ్​వివరాల ప్రకారం.. జిల్లాలోని తుర్కపల్లికి చెందిన చెందిన బండారి వెంకటేశ్​ రాంనగర్​లో నివాసం ఉంటున్నాడు. డ్రైవర్​గా పని చేస్తున్న అతను తన అవసరాల కోసం బైక్ లు దొంగిలించడం మొదలు పెట్టాడు.

 భువనగిరి, యాదగిరిగుట్ట, బీబీనగర్, మేడ్చల్​ జిల్లా ఘట్​కేసర్​పరిధిలో 5 వాహనాలను ఎత్తుకెళ్లాడు.  కేసులను విచారించిన పోలీసులు వెంకటేశ్​ను అనుమానించి, మంగళవారం అదుపులోకి తీసుకొని, విచారించారు. అతను నేరం అంగీకరించగా బైక్​లను స్వాధీనం చేసుకున్నారు.  వెంకటేశ్​ను ​అరెస్టు చేసి, రిమాండ్​కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.