- అల్లు అర్జున్ డబ్బు మదంతో మాట్లాడుతున్నడు: సస్పెండెడ్ ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి
- జాగ్రత్త గా మాట్లాడకపోతే ఎక్కడ రీల్ కట్‌చేయాలో మాకు తెలుసు
- పోలీసులు ఇంటికొస్తే కనీస గౌరవం ఇవ్వవా?
- మేం పది నిమిషాలు తప్పుకుంటే పరిస్థితి ఏంది?
- పోలీసు కుటుంబాలు, అసోసియేషన్ తరఫున విష్ణుమూర్తి ప్రెస్‌మీట్
ఖైరతాబాద్, వెలుగు: ఎవ్వరైనా సరే పోలీసులను నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని, తోలు తీస్తామని సస్పెండెడ్ ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి హెచ్చరించారు. అల్లు అర్జున్ డబ్బు మదంతో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఫైర్ అయ్యారు.
ఆదివారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ విష్ణుమూర్తి మాట్లాడారు. సంధ్య థియేటర్ఘటనలో పోలీసులదే తప్పు అన్నట్టు అల్లు అర్జున్ మాట్లాడుతున్నాడని, పోలీసుల మీద నిందలు వేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. సినిమా బెనిఫిట్‌షోకు అల్లు అర్జున్‌కు అనుమతి ఇవ్వకపోయినా థియేటర్‌కు వచ్చాడని, అయినా పోలీసులు అక్కడికి వెళ్లి డ్యూటీ చేశారని చెప్పారు.
పోలీసు బందోబస్తు అన్నది అప్పటికప్పుడు కుదరదని, దానికి కొంత ప్రాసెస్ఉంటుందని తెలిపారు. పర్మిషన్ఇవ్వకున్నా ర్యాలీ తీసి.. అక్కడ ఒకరు చనిపోతే పోలీసులను బద్నాం చేస్తున్నాడన్నారు. కొందరు నటులు, రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, పోలీసులను నోటికి వచ్చినట్టు మాట్లాడినా.. కించపర్చినా సహించబోమన్నారు. పోలీసు కుటుంబసభ్యులు, పోలీస్ అసోసియేషన్ తరఫున తాను మాట్లాడుతున్నానని చెప్పారు.
అందరూ పండుగలు చేసుకుంటుంటే..పోలీసులు రోడ్లపై కాపలా కాస్తారని తెలిపారు. తాము ఒక్క పది నిమిషాలు తప్పుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని అన్నారు. ‘‘ఒక్క పోలీసు అధికారిని కూడా నీ దగ్గరకు రాకుండా చేస్తాం.. ఎలా బయటకి వెళ్తావ్?’’ అని అల్లు అర్జున్ను ప్రశ్నించారు. తామూ మనుషులమేనని, అభాండాలు వేసి తమను అవమానపరచొద్దని కోరారు.
నిందితుడు ప్రెస్ మీట్ఎలా పెడ్తడు?
అల్లు అర్జున్ఒక నిందితుడని, తాత్కాలిక బెయిల్‌పై ఉన్న వ్యక్తి నిబంధనలు అతిక్రమించి ప్రెస్‌మీట్ ఎలా పెడతాడని విష్ణుమూర్తి ప్రశ్నించారు. ఈ కారణంగా ఆయన బెయిల్రద్దు చేయాలని పోలీసులు కోర్టును కోరే అవకాశం ఉందని చెప్పారు. సెలబ్రిటీలుగా చెప్పుకునే వారు పోలీసుల రక్షణ లేకుంటే ఎక్కడికైనా వెళ్లగలరా? అని ప్రశ్నించారు. ‘-‘నీ సినిమాలో పోలీసును కుక్క కూడా గుర్తు పట్టదు అన్నట్టు చూపించావ్. ఒక పోలీస్ఆఫీసర్ను బట్టలు విప్పించే సీన్‌కూడా పెట్టావ్. వెయ్యి రూపాయిలిస్తే ముద్దు పెడతావా? అనే సీన్పెట్టి మహిళలను అవమానించావ్.
అసలు సమాజానికి నువ్వు ఏం సందేశం ఇస్తున్నట్టు’’ అని క్వశ్చన్వేశారు. రైతుల గురించి, దేశ సైనికుల కోసం సినిమాలు తీయాలని, గొప్ప సందేశమున్న సినిమాలు తీసి సమాజానికి ఉపయోగపడాలని సూచించారు. స్మగ్లర్లు హీరోలుగా తెరకెక్కే సినిమాలకు సెన్సార్ బోర్డు ఎలా అనుమతి ఇస్తున్నదని ప్రశ్నించారు. ‘‘నీ సినిమాలో నువ్వు స్మగ్లర్‌గా చేశావ్.. అంటే సమాజంలో యువత నీలా తయారవ్వాలా? సమాజం పట్ల నీకు ఎలాంటి బాధ్యత లేదు” అని అల్లు అర్జున్ పై ఫైర్ అయ్యారు.
ఏసీపీ విష్ణుమూర్తిపై క్రమశిక్షణా చర్యలు
ఉన్నతాధికారుల అనుమతి లేకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సంధ్య థియేటర్ఘటనపై సస్పెండెడ్ ఏసీపీ విష్ణుమూర్తి ప్రెస్కాన్ఫరెన్స్ పెట్టారని సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్‌యాదవ్ వెల్లడించారు. ఈ విషయంపై డీజీపీకి నివేదిక అందజేస్తున్నామని, ఆయనపై క్రమశిక్షణా చర్యలుంటాయని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలను సహించబోమని తెలిపారు.