భీమదేవరపల్లి, వెలుగు : ఇంక్రిమెంట్ల కోసం నకిలీ ప్రొసీడింగ్స్ సమర్పించి, ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించిన ఓ హెచ్‌ఎంపై సస్పెన్షన్ వేటుపడింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర జడ్పీహెచ్‌ఎస్‌లో హెచ్‌ఎంగా పనిచేస్తున్న ఎల్. కరణ్ గతంలో భూపాలపల్లి జిల్లాలో పనిచేసే టైంలో పలు అక్రమాలకు పాల్పడ్డాడు. స్వీపర్ల డబ్బులు, ఉపాధ్యాయుల జీతాలకు సంబంధించి తప్పుడు చలాన్లు సృష్టించడంతో పాటు మధ్యాహ్న భోజన వర్కర్ల డబ్బులు కూడా కాజేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
దీంతో డీటీఎఫ్ ఉమ్మడి జిల్లా లీడర్లు విద్యాశాఖ ఆఫీసర్లకు ఫిర్యాదు చేయడంతో కరణ్‌ను సస్పెండ్ చేశారు. దీంతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేసి సర్వీసు నుంచి తొలగించారు. ఆ తర్వాత కరణ్ కోర్టును ఆశ్రయించి తిరిగి సర్వీస్‌లోకి వచ్చారు. సస్పెన్షన్ పీరియడ్ సెటిల్ కాకుండానే భూపాలపల్లి, హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారుల పేరున నకిలీ ఉత్తర్వులు సృష్టించి రెగ్యులర్ ఇంక్రిమెంట్లు పొందారు.
దీంతో డీటీఎఫ్ రాష్ట్ర, జిల్లా శాఖలు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వరంగల్ ఆర్‌జేడీ సత్యనారాయణరెడ్డి ఎంక్వైరీ జరిపించారు. ఆరోపణలు నిజమేనని తేలడంతో హెచ్‌ఎం కరణ్‌ను సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ జారీ చేశారు.