మోదీ పాలనలో..గోహత్యలు పెరిగిపోయాయ్ : జగద్గురు శంకరాచార్య స్వామి శ్రీఅవిముక్తేశ్వరానంద సరస్వతి

మోదీ పాలనలో..గోహత్యలు పెరిగిపోయాయ్ : జగద్గురు శంకరాచార్య స్వామి శ్రీఅవిముక్తేశ్వరానంద సరస్వతి
  • అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆవేదన
  • స్లాటర్ హౌజ్ ల నుంచి బీజేపీకి పార్టీ ఫండ్​వస్తోందని ఆరోపణ

బషీర్ బాగ్, వెలుగు: భారత సనాతన ధర్మంలో ఆవుకు విశిష్ట స్థానం ఉందని, అలాంటి ఆవును వధించడం దారుణమని జగద్గురు శంకరాచార్య స్వామి శ్రీఅవిముక్తేశ్వరానంద సరస్వతి అన్నారు. గో ధ్వజ్ స్థాపన భారత్ యాత్ర–2024లో భాగంగా బుధవారం రవీంద్రభారతిలో గోప్రతిష్ట నిర్వహించారు. అవిముక్తేశ్వరానంద సరస్వతి పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక గోవధను నిర్మూలిస్తారనే నమ్మకం ఉండేదని, కానీ గతంలో కంటే మోదీ ప్రధాని అయ్యాక గోవధలు మరింత పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గోమాంసం ఎగుమతిలో దేశంలోనే యూపీ మొదటి స్థానంలో ఉండటం ఇందుకు నిదర్శనం అని చెప్పారు. బీజేపీ హయాంలో స్లాటర్ హౌజ్​లు పెరిగిపోయాయని, వాటి యజమానుల నుంచి పార్టీ ఫండ్​తీసుకుంటున్నారని ఆరోపించారు. హిందుల ప్రభుత్వమని చెప్పుకుంటున్న మోదీ ఆచరణలో చూపించడం లేదని విమర్శించారు. ఇక నుంచి ఆవు రక్షణే తమ అజెండా అని, గోవును కాపాడే వారికే ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తిరుపతి లడ్డూ వివాదం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. టీటీడీకి రూ.3లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని, ఇప్పటికైనా సొంతంగా గోశాల నిర్వహించాలని సూచించారు. గోవును కాపాడే నినాదంతో తాము ప్రజల్లోకి వెళ్తున్నామని స్పష్టం చేశారు.