భౌతిక దేహాన్ని ప్రసాదించిన మాతాపితరులు భువనేశ్వరి, విశ్వనాథదత్తులు ఆధ్యాత్మిక జన్మనిచ్చిన జననీజనకులుశారదామాత, రామకృష్ణపరమహంసలు వివేకానందుడిగా నామకరణం చేసిన తండ్రి ఖేత్రీ మహారాజు.
ఇలా పేరొందిన వివేకానందుడు 1893సం. జనవరి12 న కలకత్తాలో జన్మించాడు. భగవంతుడిని అన్వేషిస్తూ ఎంతో మందిని దర్శించాడు. ఎట్టకేలకు రామకృష్ణ పరమహంసలోనే భగవంతుని దర్శించిన మహానుభావుడు నరేంద్రనాథ దత్తా. నరేంద్రుడు ఆటపాటలతో, ధ్యానంతో కాలం గడిపేవాడు. అదే ఒక వ్యక్తికి అవసరమని బలంగా విశ్వసించాడు. అందుకే శారీరక బలం, ఆధ్యాత్మిక బలం, మానసిక బలం గురించి పదేపదే బోధించేవాడు. బలమే జీవనం, బలహీనతే మరణం’ అని గట్టిగా నమ్మాడు. తాను నమ్మిన దానిని లోకానికి చాటి చెప్పిన మహనీయుడు వివేకానందుడు.
లేవండి, మేల్కోండి, ఎంత మాత్రమూ నిద్రించవద్దు (ఉత్తిష్ఠ, జాగ్రత, ప్రాప్యవరాన్నిబోధత) అంటూ జాతిని జాగృతం చేశాడు. ‘‘అన్ని కష్టాలను తొలగించుకునే శక్తి మీ అందరిలోనూ ఉంది’’ అంటూ మానవుల శక్తి గురించి బోధించాడు. ఒక వ్యక్తిలో నిద్రాణంగా ఉండే శక్తిని బయటకు లాగే ప్రయత్నం చేశాడు. మనలోని శక్తితో ఎన్ని పనులైనా చేయవచ్చని ఎరుకపరిచాడు. మానవుడు శక్తిమంతుడుగా మారినపుడే ఆపదలను ధైర్యంగా ఎదుర్కోగలడు. అలాగని బలహీనుడిని చులకనగా చూడలేదు, చూడమనలేదు. ‘మానవుడిలోని బలహీనతను తప్పు పట్టవద్దు. చేతనయితే ఆ బలహీనతను దూరం చెయ్యడానికి కావలసిన సాయం చెయ్యాలి. బలహీనులను గేలి చెయ్యకూడదు’’ అన్నాడు. బలహీనులను బలవంతులుగా మార్చడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని సంకల్పించాడు వివేకానందుడు. ఏ మనిషీ బలహీనుడు కాదు. పరిస్థితుల కారణంగా ఒక వ్యక్తి బలహీనుడవుతాడు. అందువల్లే అతని అంతరాత్మను జాగరూకపరచాలని, అతడిని బలవంతునిగా చెయ్యాలని తన ఉపన్యాసాలలో తరచుగా అనేవాడు. మానవుడిని బలవంతుడిగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తే, మానవుడు తనలో నిద్రాణమైన శక్తిని వెలికి తీయగలుగుతాడనే దృఢ విశ్వాసం ఆయన ఉపన్యాసాలలో తరచూ పలికేవాడు. బలహీనుడిని బలవంతుడిగా మార్చడమనేది ఒక మంచి కార్యం.
వివేకానందుడు యువతను ఉత్తేజపరచడానికి ఇష్టపడేవాడు. ఎందుకంటే యువకులకు వారి బలం మీద వారికి అత్యధిక విశ్వాసం ఉంటుంది. ఆ బలంతో వారు ఉత్తేజితులై కార్యాలను నిర్వర్తించగలుగుతారు. ‘‘విధిరాత అనేవాడు బలహీనుడు. నా కర్మకు నేనే కర్తను అనేవాడు బలవంతుడు. వృద్ధులు విధిరాత అంటారు. యువకులు బలాన్ని నమ్ముతారు’’ అని వివేకానందుడి బోధనల్లో ఉంటుంది. ‘వార్థక్యం వల్ల బలహీనమైన వాడు తన బలహీనతకు పెట్టుకున్న పేరే విధిరాత’ అంటూ వాళ్లలోని బలహీనతను పారద్రోలడానికి వివేకానందుడు కృషి చేశాడు.
బలమైన సంకల్పం ఉంటే పాము విషం కూడా నిన్నేమీ చెయ్యలేదు’’ అని ధైర్యం చెబుతూ, ఒక కార్యం చేసేటప్పుడు మనకు ఎదురయ్యే సమస్యలే పాము విషం లాంటివని, విషానికి భయపడితే విజయం సాధించలేమని జాతిని జాగృతం చేశారు. ‘‘ఆత్మకు సాధ్యం కానిది ఏదీ లేదు. బలవంతులకు అసాధ్యమైనది ఏదీ లేదు. మన బలమే మన గెలుపు’’ అని ఎలుగెత్తి చాటారు. ఎవరు బలంగా ఉంటారో వారికి ఓటమి లేదని వివేకానందుని నమ్మకం. ‘‘అజ్ఞాన ద్రవ్యరాశి మీద ఫిరంగి గుండు మాదిరి పేలే ఒకే పదం నిర్భయత్వం. వేదవేదాంతాలలోని సారమే బలం. యువకులందరూ బలంగా ఉండాలి, బలం వల్ల నిర్భయంగా ఉండగలుగుతారు’’ అంటారు. బలమైన శరీరం ఉంటే బలమైన మనస్సు ఉంటుంది.
మనస్సు బలంగా ఉంటే సంకల్పం గట్టిగా ఉంటుంది. సంకల్ప బలంతో మానవుడు అన్నిటినీ నిర్విఘ్నంగా సాధించగలుగుతాడు. ఆ విషయం అందరికీ అర్థమయ్యేలా, ‘‘ఈట్ మీట్ అండ్ ప్లే ఫుట్ బాల్’’ అన్నాడు. బలమైన ఆహారం తిని ఫుట్‌బాల్ ఆడండి అని వివేకానందుడు పలికిన వాక్యాలు యువతను ఉత్తేజపరుస్తాయి. ‘‘పిరికితనమనే భయంకరమైన వ్యాధిని తరిమి కొట్టండి’’ అంటూ ధైర్యం కలిగించేలా తన వాణి వినిపించారు. బలమే ఆరోగ్యం. బలహీనతే పిరికితనం. అదే భయంకరమైన వ్యాధి. ఆ వ్యాధిని నయం చేసుకోకపోతే మానవుడు విజయం సాధించలేడు. భారతీయులు పిరికితనాన్ని వదిలి ఆంగ్లేయులను తమ సంకల్ప బలంతో ఎదుర్కొన్నారు. విజయం సాధించారు అని వివేకానందుడు యువతకు మనోబలాన్ని ఇచ్చే ఉపన్యాసాలు చేశారు. వివేకానందుని జీవితం యువతకు ఆదర్శప్రాయం. వివేకానందుని జయంతి సందర్భంగా ఆయనను స్మరించకపోయినా, ఆయన బాటలో నడవడానికి ప్రయత్నిం చేయాలని పెద్దలు చెప్తారు.
-డా. పురాణపండ వైజయంతి