స్వామి యుక్తేశ్వర్ గిరి మహాసమాధి రోజు.. భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు

హైదరాబాద్: భారతదేశపు అతి గొప్ప సాధువులలో ఒకరైన స్వామి యుక్తేశ్వర్ గిరి మహాసమాధిని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా కార్యక్రమాలు జరిగాయి. హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహించారు. భారత దేశపు అతి గొప్ప సాధువుల్లో ఇద్దరి మహాసమాధి రోజులు ప్రతి సంవత్సరము మార్చి నెలలో వారి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నారు. చిరస్థాయిగా నిలిచి ఉండే మహాగ్రంథమైన హోలీ సైన్స్ ను రచించిన స్వామి యుక్తేశ్వర్ గిరి 1936 మార్చి 9 న ఒరిస్సాలోని పూరీలో తన శరీరత్యాగం చేయగా, ప్రపంచ విఖ్యాతి పొందిన ఆయన శిష్యులు పరమహంస యోగానంద  1952 మార్చి 7న కాలిఫోర్నియా లోని లాస్ ఏంజలిస్‌లో ఉన్న బిల్ట్ మోర్ హోటల్ లో మహాసమాధి చెందారు. 

ప్రాచీన శాస్త్రీయ ధ్యాన పద్ధతి అయిన “క్రియాయోగం” యోగానంద బోధనలకు ప్రధాన ఇతివృత్తం. ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది క్రియాయోగ “దీక్ష తీసుకున్నవారు” అనివార్యమైన జనన మరణ చక్రాల నుండి విముక్తి కోసం క్రమం తప్పకుండా ఈ ప్రాచీన ప్రక్రియను సాధన చేస్తున్నారు. ఈ ప్రాణాయామ ప్రక్రియ ద్వారా ప్రాణశక్తిని అదుపులో ఉంచి, శక్తిని బాహ్యంగా, పంచేంద్రియాల వైపు కాకుండా; లోపలకి, వెనుబాము మరియు మెదడు వైపుకు మరలిస్తారు. భక్తిని, సరైన కార్యాచరణను, గురువు యొక్క మార్గదర్శకతను జోడించినపుడు ఈ “క్రియాయోగ” ప్రక్రియ విఫలం కాదు అని యోగానంద అనేవారని భక్తులు తెలిపారు. 

యోగానంద ప్రపంచ ప్రఖ్యాత ”ఒక యోగి ఆత్మకథ” ముద్రించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ ఏడాది దాని స్మారకోత్సవం జరుపుకొంటున్నారు. “మిగిలినవన్నీ ఆలస్యం చెయ్యవచ్చు గాక; కానీ మీ దైవాన్వేషణను మాత్రం ఆలస్యం చెయ్యడానికి వీలులేదు!” అన్న మాటలతో యోగానంద ప్రజలు సమయం వ్యర్థం చేయకుండా తమ జీవితాలనే తోటల నుంచి కలుపు మొక్కలను పెరికివేసి జీవిత సర్వోత్కృష్ట లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని పిలుపునిచ్చారని ఆయన భక్తులు గుర్తు చేసుకున్నారు.

మరింత సమాచారం కోసం: yssofindia.org