- వనదుర్గా ప్రాజెక్ట్ కింద 21,625 ఎకరాలకు సాగునీరు
- సంగారెడ్డిలో కాల్వల రిపేర్ల వల్ల సింగూరు నుంచి నీటి విడుదల జరగదని చెప్పిన అధికారులు
మెదక్, సంగారెడ్డి, వెలుగు: యాసంగి సీజన్ లో మెదక్జిల్లాలో వివిధ సాగునీటి వనరుల ద్వారా 28,335 ఎకరాలకు సాగునీరు అందివ్వాలని తైబందీ ఖరారు చేశారు. నాలుగు రోజుల కింద కలెక్టర్ రాహుల్ రాజ్ అధ్యక్షతన, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ఉన్నతాధికారులతో కలెక్టరేట్ లో జరిగిన ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ లో యాసంగి పంటలకు సాగునీటి విడుదలకు తీర్మానం చేశారు.
జిల్లాలో ఏకైక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన వనదుర్గా ప్రాజెక్ట్ కింద 21,625 ఎకరాలకు, జిల్లాలోని వివిధ మండలాల్లో 500 ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టు ఉన్న 10 చెరువుల కింద 6,710 ఎకరాలకు నీరు ఇవ్వాలని నిర్ణయించారు.
ఎంఎన్, ఎఫ్ఎన్ కెనాళ్ల కింద
వనదుర్గా ప్రాజెక్ట్ పరిధిలోని మహబూబ్ నహర్ కాలువ (ఎంఎన్ కెనాల్) కింద కొల్చారం మండలం పోతంశెట్‌పల్లి, కిష్టాపూర్, రాంపూర్గ్రామాల పరిధిలో 1,359 ఎకరాలకు, మెదక్ మండల పరిధిలో మాచవరం, ర్యాలమడుగు, చిట్యాల, బాలానగర్, పేరూర్, రాచపల్లి, మెదక్ టౌన్ పరిధిలో 4,733 ఎకరాలు, హవేలీ ఘనపూర్ మండల పరిధిలోని కూచన్‌పల్లి, ముత్తాయికోట, శేరి కుచన్‌పల్లి, తోగుట, బోగడ భూపతిపూర్, ముత్తాయిపల్లి, ముగ్దుంపూర్, ఫరీద్పూర్, మదుల్వాయి, సర్ధన గ్రామాల పరిధిలో 5,332 ఎకరాలు, ఫతేనహర్ కాలువ (ఎఫ్ఎన్కెనాల్) పరిధిలో పాపన్నపేట మండలంలోని నాగ్సానిపల్లి, కొత్తపల్లి, పొడ్చన్‌పల్లి, ఎల్లాపూర్, గాంధారిపల్లి, అబ్లాపూర్, అన్నారం, యూసుఫ్‌పేట, దౌలాపూర్, కుర్తివాడ, మిన్పూర్, పాపన్నపేట గ్రామాల పరిధిలో 10,200 ఎకరాలకు వనదుర్గా ప్రాజెక్ట్ నుంచి సాగు నీరు అందించనున్నారు.
ఏ చెరువు కింద ఎంతంటే..
వెల్దుర్తి మండలం లోని హల్దీ ప్రాజెక్ట్ కింద 2,600 ఎకరాలకు, మెదక్ మండలంలోని రాయిన్ పల్లి ప్రాజెక్ట్ కింద 600 ఎకరాలకు, మెదక్ మండలం కొంటూర్పెద్ద చెరువు కింద వెయ్యి ఎకరాలకు, రామాయంపేట మండలం నార్లాపూర్హైదర్చెరువు కింద 400 ఎకురాలకు, నర్సాపూర్ రాయరావ్ చెరువు కింద 200 ఎకరాలకు, వెల్దుర్తి దేవతల చెరువు కింద 650 ఎకరాలకు, చిన్నశంకరంపేట అంబాజీపేట పెద్ద చెరువు కింద 500 ఎకరాలకు, టేక్మాల్మండలం కుసంగి మాసన్పల్లి చెరువు కింద 230 ఎకరాలు, టేక్మాల్పెద్ద చెరువు, చిన్న చెరువు కింద 230 ఎకరాలు, తూప్రాన్పెద్ద చెరువు కింద 300 ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని నిర్ణయించారు.
సింగూరు కాల్వలకు లైనింగ్..
సింగూర్ ప్రాజెక్ట్ ద్వారా సంగారెడ్డి జిల్లాలో ప్రతి యాసాంగి సీజన్ లో 50వేల ఎకరాలకు నీరు అందిస్తున్నారు. కుడి, ఎడమ కాల్వల ద్వారా 40వేల ఎకరాలు, మరో 10 ఎకరాలు చెరువులు, కుంటల అనుసంధానం ద్వారా నీళ్లు వదిలేవారు. కానీ ఈసారి యాసాంగి సీజన్ కు సింగూరు నీటిని సాగు నిమిత్తం వదిలే పరిస్థితి లేదు. ఎందుకంటే కుడి, ఎడమ కాలువల మరమ్మతుల నేపథ్యంలో వాటికి సిమెంట్ లైనింగ్ వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించి ఫండ్స్ రిలీజ్ చేసింది.
ప్రస్తుతం కాల్వల రిపేర్పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఈ యాసాంగికి సాగునీరు వదలడం కుదరదని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే గతేడాది ఇదే యాసాంగిలో సింగూరు ప్రాజెక్టులో నీటి నిల్వ 13.5 టీఎంసీలు మాత్రమే ఉండడంతో సాగుకు నీటిని విడుదల చేయలేదు.
29.917 టీఎంసీల నీటి సామర్థ్యం గల సింగూరులో 16 టీఎంసీల కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే సాగు కోసం నీటిని విడుదల చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. కాగా అప్పట్లో ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడం వల్ల సాగునీటి వినియోగం లేకపోగా ఈసారి సింగూరులో సమృద్ధిగా నీళ్లు ఉన్నప్పటికీ కాల్వల మరమ్మతుల కారణంగా సాగునీటిని విడుదల చేయలేకపోతున్నారు.