పోలీసుల ఎదుట విచారణకు హాజరైన టేస్టీ తేజ

పోలీసుల ఎదుట విచారణకు హాజరైన టేస్టీ తేజ
  • మిగతా 10 మంది రాలే
  • మూడు రోజుల తర్వాత వస్తానన్న విష్ణుప్రియ
  • పంజాగుట్ట పీఎస్​లో శేఖర్​బాషా ప్రత్యక్ష్యం
  • విష్ణుప్రియ, టేస్టీ తేజ కోసం టైం అడిగిన ఆర్ జే 
  • రాత్రి వేళ ఉన్నట్టుండి పీఎస్​కు టేస్టీ తేజ 

హైదరాబాద్ సిటీ/పంజాగుట్ట, వెలుగు: బెట్టింగ్ యాప్స్​ప్రమోట్ చేస్తున్న 11 మంది ఇన్​ప్లూయన్సర్లపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సోమవారం కేసు నమోదు కాగా, మంగళవారం సాయంత్రం 4 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఎవరూ రాలేదు. రాత్రి10:30  గంటలకు టేస్టీ తేజ విచారణకు హాజరయ్యాడు. మిగతా వారెవరూ అందుబాటులో లేరు. వారి ఫోన్లను స్విచ్ఛాఫ్​చేసుకోవడంతో వారు ఎక్కడున్నారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.  

శేఖర్​ బాషా ఎంట్రీ 

ఇన్​ఫ్లూయన్సర్లకు నోటీసులు ఇవ్వడంతో వారంతా మంగళవారం వస్తారని మీడియా పంజాగుట్ట పోలీస్ స్టేషన్​ముందే పడిగాపులు కాసింది. అయితే, ఎవరూ రాకపోగా మధ్యాహ్నం వేళ అనూహ్యంగా లావణ్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్​జే, బిగ్​బాస్ ​ఫేమ్ ​శేఖర్ ​పీఎస్​లో ప్రత్యక్షమయ్యాడు. తన పర్సనల్​పనిపై వచ్చానని చెప్పిన ఆయన సీఐతో యాంకర్, నటి విష్ణుప్రియ, టేస్టీ తేజ గురించి మాట్లాడినట్టు తెలిసింది.

 వారిద్దరూ షూటింగ్​లతో బిజీ ఉండడం మూలంగా విచారణకు హాజరుకాలేకపోతున్నారని, మరో మూడు రోజులు సమయం ఇవ్వాలని కోరారు. పోలీసులు అనుమతి ఇచ్చినట్టు తెలిసింది. ఏమైందో ఏమోగానీ రాత్రి వేళ టేస్టీ తేజ పీఎస్​లో ప్రత్యక్షమయ్యాడు. 3 గంటలపాటు విచారణ కొనసాగింది. బయటికొచ్చాక త్వరలోనే ప్రెస్​మీట్​ పెట్టి వివరాలు వెల్లడిస్తానని తేజ చెప్పాడు.

నిందితుల్లో కానిస్టేబుల్​ 

బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్​చేస్తున్న 11మందిపై కేసు నమోదు చేశామని, ఇందులో ఒకరు హబీబ్​నగర్​పీఎస్​లో కానిస్టేబుల్​అని సౌత్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇమ్రాన్​ఖాన్​అనే ఇన్​ప్లూయన్సర్​గలీజ్​గా వ్యవహరిస్తున్నాడని, చిన్న పిల్లలతో మందు తెప్పించడం, పిల్లల చేత బూతులు పలికించడం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

 కేసు నమోదైన వారి అకౌంట్లకు ఏ విధంగా డబ్బు వస్తుంది, ఎలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు అని సోషల్ మీడియా అకౌంట్ లను చెక్ చేస్తామన్నారు. గతంలో మంచు లక్ష్మీప్రసన్న బెట్టింగ్ గేమ్స్ గురించి ప్రమోట్ చేశారని వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించగా బెట్టింగ్ గురించి ప్రమోట్ చేసే ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు.