టాక్స్​ వసూళ్లలో పల్లెలే టాప్​..పట్నంలోనే వీక్

 టాక్స్​ వసూళ్లలో  పల్లెలే టాప్​..పట్నంలోనే వీక్
  • పట్నంలోనే వీక్
  • పంచాయతీల్లో 90 శాతానికి పైగా వసూలు
  • మున్సిపాలిటీల్లో 60 శాతమే
  • సర్కారు వారి బకాయిలు ఎక్కువే

యాదాద్రి, నల్లగొండ, వెలుగు : ఆదాయం తక్కువగా ఉండే పల్లెల్లో ప్రాపర్టీ ట్యాక్స్​ కడుతుంటే.. ఎక్కువ ఇన్​ కం ఉండే పట్టణాల్లో సరిగ్గా కడ్తలేరు. మున్సిపాలిటీల్లో వసూలు అంతంత మాత్రంగానే ఉంది. పన్ను వసూలకు వెళ్లిన వారిని రేపు.. మాపు అంటూ తిప్పించుకుంటున్నారు. ఇందులో సర్కారు వారి బకాయిలు కూడా ఉన్నాయి. వీటితోపాటు వాణిజ్య సంస్థలు పన్ను చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. వసూలు స్పీడ్​గా చేయాలని ఆదేశాలు జారీ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. 

పల్లెల్లో  కలెక్షన్ ఎక్కువ..

కొత్తగా ఏర్పాటు చేసిన ఐదు పంచాయతీలు కలిపి యాదాద్రి జిల్లాలో 17 మండలాల్లో 428 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీల్లో పన్ను చెల్లించే బిల్డింగ్స్ 2,03,430 ఉన్నాయి. వీటిలో అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు, ఇంజినీరింగ్‌‌‌‌, వృత్తి విద్యా కళాశాలలు కూడా ఉన్నాయి. 

అత్యధికంగా రామన్నపేట మండలంలో పన్ను చెల్లించే ఇండ్లు 18,988 ఉండగా, మోత్కూరు మండలంలో అతితక్కువగా 4,565 మాత్రమే ఉన్నాయి. 428 పంచాయతీల్లో 2024–--25 ఫైనాన్షియల్ ఇయర్​లో రూ.17,83,50,350 ఇంటి పన్ను వసూలు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు రూ.15,70,65,860 (93 శాతం) వసూలు చేశారు. మిగిలిన రూ.1.13 కోట్ల (ఏడు శాతం)లో ఎక్కువగా ప్రభుత్వ భవనాలు, కొన్ని వ్యాపార సంస్థల నుంచి రావాల్సి ఉంది.  

నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో..

నల్గొండ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో మార్చి 31 నాటికి 90 శాతం పన్ను వసూళ్లు చేశారు. జిల్లాలో మొత్తం 868 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం రూ.22.28.24,101 వసూలు చేయాల్సి ఉండగా, మార్చి 31 వరకు రూ.20,10,47,907 వసూలు చేశారు. ఇంకా రూ.2,17,76,194 వసూలు చేయాల్సి ఉంది. సూర్యాపేట జిల్లాలో 23 మండలాలు ఉండగా 475 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రూ.11.58 కోట్లు వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకోగా, రూ.10.55 కోట్లు వసూలు చేశారు. 

మున్సిపాలిటీల్లో కలెక్షన్​ వీక్..​

యాదాద్రి జిల్లాలోని మున్సిపాలిటీల్లో పన్ను చెల్లించే భవనాలు 43,535 ఉన్నాయి.  వీటిలో పన్ను రూపంలో  రూ.26.34 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు రూ.15.51 కోట్లు (58.91 శాతం) వసూలు అయ్యాయి. ఆలేరులో 2.29 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా, రూ.1.19 కోట్లు (56 శాతం) వసూలు అయ్యాయి. 

భువనగిరిలో 9.97 కోట్లకు రూ.5.59 కోట్లు (61 శాతం) వసూలు అయ్యాయి. చౌటుప్పల్​లో రూ.7.39 కోట్లకు రూ.4.84 కోట్లు (76 శాతం) వచ్చాయి. మోత్కూరులో రూ.1.26 కోట్లకు రూ.91.75 లక్షలు (80 శాతం) వసూలు అయ్యాయి. పోచంపల్లిలో రూ.2.13 కోట్లకు రూ.1.07 కోట్లు (60.4 శాతం) వసూలు, యాదగిరిగుట్టలో రూ.3.28 కోట్లకు రూ.1.89 కోట్లు (76.4 శాతం) వసూలు అయ్యాయి.  

నల్లగొండ జిల్లాలో..

జిల్లాలోని నల్గొండ మున్సిపాలిటీలో రూ.19.84 కోట్లకు రూ.15.68 కోట్లు, నకిరేకల్​లో రూ.12.70 కోట్లకు రూ.11.51 కోట్లు, మిర్యాలగూడలో రూ.21.15 కోట్లకు రూ.9.93 కోట్లు, దేవరకొండలో రూ.2.47 కోట్లకు రూ.2.08 కోట్లు, హాలియాలో రూ.1.39 కోట్లకు రూ.1.38 కోట్లు, చండూరులో రూ.55లక్షలకు రూ.51 లక్షలు వసూలు అయ్యాయి. సూర్యాపేట మున్సిపాలిటీలో రూ.12.70 కోట్లకు రూ.11.51 కోట్లు, హుజూర్ నగర్​లో రూ. 2.20 కోట్లకు రూ.1.85 కోట్లు, కోదాడలో రూ.5.35 కోట్లకు రూ.5.04 కోట్లు, నేరేడుచర్లలో రూ.91 లక్షలకు రూ.90 లక్షలు, తిరుమలగిరిలో రూ.1.10 కోట్లకు రూ.96 లక్షలు వసూలు చేశారు.   

పన్ను బకాయిలు ..

మున్సిపాలిటీల్లోని గవర్నమెంట్ ఆఫీసులకు సంబంధించిన పన్ను బకాయిలు కూడా ఉన్నాయి.  యాదాద్రి జిల్లాలోని భువనగిరి మున్సిపాలిటీలో రూ.2.05 కోట్లు పెండింగ్​లో ఉంది. ఆలేరులో రూ. 15.50 లక్షలు, మోత్కూరులో రూ. 18 లక్షలు, చౌటుప్పల్​లో రూ.9.90 లక్షలు,  భూదాన్ పోచంపల్లిలో రూ.34 లక్షలు, యాదగిరిగుట్టలో రూ.60 లక్షలు వసూలు కావాల్సి ఉంది.