టీడీపీ, జనసేన ఎన్నికల మిని మేనిఫెస్టో రిలీజ్.. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తాం. .

వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే  2024 ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీచేయాలని నిర్ణయించుకున్నాయి.  ఈ క్రమంలో ఈ రోజు ( నవంబర్ 13) టీడీపీ.. జనసేన పార్టీలు ఎన్నికల ఉమ్మడి మిని  మ్యానిఫెస్టోను  విడుదల చేశాయి. ఇప్పటికే రాజమండ్రి వేదికగా సూపర్ సిక్స్ పేరుతో ఆరు గ్యారంటీల మినీ మ్యానిఫెస్టోను టీడీపీ ప్రకటించింది. ఆ తర్వాత జనసేన కూడా కలవడంతో ఇప్పుడు మరో ఆరు గ్యారంటీలు కలుపుకుని మొత్తం 11 గ్యారంటీలతో సోమవారం (నవంబర్ 13) ఉమ్మడి మినీ మ్యానిఫెస్టోగా ప్రకటించారు.

టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఉమ్మడి మినీ మ్యానిఫెస్టో వివరాలను  వెల్లడించారు. గతంలో టీడీపీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా స్టార్టప్ సంస్థల ఏర్పాటుకు రూ.10లక్షల వరకూ రాయితీ, ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు, అమరావతే రాజధానిగా కొనసాగింపు, పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం వంటివి కొత్తగా మినీ మేనిఫెస్టోలో చేర్చారు. గతంలో టీడీపీ రాజమండ్రి వేదికగా ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహిళల కోసం మహా శక్తి, రైతుల కోసం అన్నదాత, యువత కోసం యువ గళం, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్, ఇంటింటికీ మంచినీరు వంటి హామీలు ఉన్నాయి.