
- యాదాద్రి జిల్లాలో 96.54
- సూర్యాపేటలో 94.97
- నల్గొండలో 94.66 శాతం నమోదు
- స్ట్రాంగ్ రూమ్ కు తరలిన బ్యాలెట్ బాక్సులు
నల్గొండ, యాదాద్రి, వెలుగు : వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల టీచర్ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. టీచర్లు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 వరకు జరిగింది. పోలింగ్ముగిసే సమయానికి క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధాహ్నం నుంచి ఊపందుకుంది. మధ్యాహ్నం 12 వరకు నల్గొండలో 55.48 శాతం, సూర్యాపేటలో 45.53 శాతం, యాదాద్రిలో 48.58 శాతం పోలింగ్ నమోదైంది.
సాయంత్రం 4 గంటలకు పోలింగ్ముగిసే సమయానికి నల్గొండలో 94.66 శాతం, సూర్యాపేటలో 94.97 శాతం, యాదాద్రిలో 96.54 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. నల్గొండలోని పోలింగ్ కేంద్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు.
సూర్యాపేటలోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పరిశీలించారు. యాదాద్రిలో కలెక్టర్హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి పరిశీలించారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను పోలీస్ భద్రత మధ్య ఆర్జాలబావి గోదాం వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. మార్చి 3న ఓట్లను లెక్కించనున్నారు.
ఏ ఎన్నికైనా.. యాదాద్రి టాప్
యాదాద్రి, వెలుగు : అన్ని ఎన్నికల మాదిరిగానే టీచర్ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ యాదాద్రి ఓటర్లు చైతన్యం చూపారు. ప్రతి ఎన్నికలోనూ జిల్లా ఓటర్లు సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. లోక్సభ ఎన్నికలతోపాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాజాగా గురువారం జరిగిన టీచర్ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అన్ని జిల్లాల కంటే యాదాద్రిలో ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
నల్లగొండ,-వరంగల్,-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యాదాద్రి జిల్లా ఓటర్లు టాప్లో నిలిచారు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లాలోని సూర్యాపేట, నల్గొండ జిల్లాలు నిలిచాయి. యాదాద్రి జిల్లాలోని 17 మండలాల్లో 984 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 950 (96.54 శాతం) మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. మిగిలిన 8 జిల్లాల్లో ఆ తర్వాత వరుస స్థానాల్లో ఉన్నాయి. చివరి స్థానంలో 91.66 శాతంతో హనుమకొండ జిల్లా నిలిచింది.
జిల్లా ఓటర్లు పోలైన ఓట్లు పోలింగ్ శాతం
నల్గొండ 4683 4433 94.66 శాతం
సూర్యాపేట 2664 2530 94.97 శాతం
యాదాద్రి 984 950 96.54 శాతం