ఎస్‌‌ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలి : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

 ఎస్‌‌ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలి : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
  • విద్యా శాఖ సెక్రటరీకి టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య వినతి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న గెజిటెడ్ హెడ్మాస్టర్ పోస్టులను ప్రమోషన్ల ద్వారా అర్హులైన సీనియర్ స్కూల్ అసిస్టెంట్ల (ఎస్‌‌ఏ)తో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు. సోమవారం సెక్రటేరియెట్‌‌లో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కొమరయ్య మాట్లాడుతూ.. గతేడాది ఆగస్టులో జీహెచ్‌‌ఎంల ప్రమోషన్ల కోసం విద్యాశాఖ అర్హులైన స్కూల్ అసిస్టెంట్ల సీనియార్టీ లిస్టులు రూపొందించారని, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సమయంలో టెక్నికల్ ఇష్యూస్‌‌తో ప్రమోషన్ల ప్రక్రియ వాయిదా వేశారని గుర్తుచేశారు. 

ఇటీవల నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల పర్యటనల సమయంలో పలువురు టీచర్లు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని వివరించారు. దీంతో పాటు ఈ వేసవి సెలవుల్లోనే టీచర్లకు పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని కోరారు. వచ్చే అకాడమిక్ ఇయర్ ప్రారంభం నాటికి, ఖాళీలు లేకుండా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కొమరయ్య వెంట తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్‌‌, రాష్ట్ర నాయకురాలు ఉషారాణి తదితరులు ఉన్నారు.