- తొలి మ్యాచ్‌లోనే మెప్పించిన సర్ఫరాజ్, జురెల్
(వెలుగు స్పోర్ట్స్ డెస్క్) : స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ జట్టుకు దూరంగా ఉండటం, తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో చిత్తవడంతో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియాకు కష్టాలు తప్పవనిపించింది. అనుభవం లేని బ్యాటింగ్ లైనప్ సిరీస్‌లో జట్టుకు అతి పెద్ద సమస్యగా కనిపించింది. కుర్ర బ్యాటర్లతో సిరీస్‌లో ముందుకెళ్లడం కష్టమేనని అనిపించింది. కానీ, మూడు మ్యాచ్‌లు ముగిసే సరికి సీన్ రివర్స్ అయింది.
జట్టులోకి కొత్తగా వచ్చిన కుర్రాళ్లు నిర్భయమైన ఆటతో ఇండియా 2–1తో ఆధిక్యం కట్టబెట్టడంతో పాటు తమ ఫ్యూచర్ సూపర్‌గా ఉందని నిరూపించుకున్నారు. మిగతా రెండు మ్యాచ్‌ల్లో ఫలితం ఎలా ఉన్నా ఈ సిరీస్‌తో యశస్వి జైస్వాల్ రూపంలో టీమిండియాకు కొత్త సూపర్ స్టార్ దొరికాడు. 22 ఏండ్ల వయసులోనే అద్భుతంగా ఆడుతున్న జైస్వాల్ వరుసగా రెండు డబుల్ సెంచరీలతో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపెట్టాడు.
నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ముందుకొచ్చిన యశస్వి అన్ని ఫార్మాట్లలోనూ జట్టులో ప్లేస్ ఖాయం అయిన తర్వాత ఓ రేంజ్‌లో విజృంభిస్తున్నాడు. ముఖ్యంగా రాజ్‌కోట్‌లో తన వయసుకు మించిన పరిణితితో ఇన్నింగ్స్‌ని నిర్మించిన విధానం టెస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ మాస్టర్-క్లాస్ అనొచ్చు. ప్రారంభంలో చాలా జాగ్రత్తగా ఆడిన అతను క్రీజులో కుదురుకున్న తర్వాత గేర్లు మారుస్తూ బౌలర్లపై ఎదురుదాడి చేసిన విధానం టాప్ క్రికెటర్‌ను తలపించింది.
వరల్డ్ గ్రేటెస్ట్ బౌలర్లలో ఒకడైన జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లను మూడు వేర్వేరు దిశల్లో కొట్టడం అతని టాలెంట్‌కు నిదర్శనం. ఇన్నింగ్స్ మొత్తంలో రికార్డు స్థాయిలో 12 సిక్సర్లు బాదిన జైస్వాల్ తనలో టెస్టు మ్యాచ్‌కు క్లాస్ బ్యాటర్‌తో పాటు అవసరమైనప్పుడు బౌలర్లను దంచికొట్టే హిట్టర్ ఉన్నాడని నిరూపించుకున్నాడు.
రాజ్‌కోట్‌లో టీమిండియాకు సర్ఫరాజ్ ఖాన్ రూపంలో మరో ఫ్యూచర్ స్టార్ లభించాడు. కోహ్లీ, కేఎల్ రాహుల్ గైర్హాజరీలో తన అరంగేట్రం మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు కొట్టిన సర్ఫరాజ్ మిడిలార్డర్‌కు తాను సరైనోడినని నిరూపించుకున్నాడు. టీమిండియాలోకి వచ్చేందుకు చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్న సర్ఫరాజ్ ఆ అవకాశం రావడంతో తొలి బాల్ నుంచే తాను ఈ లెవెల్ క్రికెట్‌కు రెడీగా ఉన్నానని చెప్పే ప్రయత్నం చేశాడు.
డొమెస్టిక్ క్రికెట్‌లో కొన్నేళ్లుగా పరుగుల మోత మోగిస్తున్నట్టుగానే టీమిండియా జెర్సీలోనూ బ్యాటింగ్ చేశాడు. ఇండియా బ్యాటర్లు సహజంగా స్వీప్ షాట్స్ ఆడేందుకు పెద్దగా ఇష్టపడరు. కానీ, రాజ్‌కోట్‌లో సర్ఫరాజ్ స్వీప్ షాట్స్‌తోనే ఎక్కువ రన్స్ రాబట్టడం స్వాగతించాల్సిన విషయం. ట్రెడిషనల్ స్వీప్‌తో పాటు స్పిన్నర్ల బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్ షాట్లతో ఈజీగా రన్స్ రాబ్టటాడు. దాంతో ఇంగ్లండ్ బౌలర్లు ఒత్తిడిలో పడిపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో జడేజా తప్పిదంతో రనౌట్ అయిన సర్ఫరాజ్ రెండో ఇన్నింగ్స్‌లో నాటౌట్‌గా నిలిచాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అతను ప్రత్యర్థి బౌలర్లకు ఏ చిన్న అవకాశం ఇవ్వకపోవడం శుభసూచకం.
ఈ తరం కుర్రాళ్లు
వరుసగా ఫెయిలవుతున్న కేఎస్ భరత్ ప్లేస్ లో తుది జట్టులోకి వచ్చిన ధ్రువ్ జురెల్ కీపర్‌గా మెప్పించాడు. వికెట్ల వెనుకాల చాలా చురుగ్గా కదిలాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో ఫామ్ లో ఉన్న ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్‌ను రనౌట్ చేసిన విధానం అద్బుతం అనొచ్చు. బ్యాటింగ్‌లోనూ జురెల్ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. పేసర్ మార్క్ వుడ్ బౌలింగ్‌లో ర్యాంప్ షాట్‌తో బాల్‌ను రోప్ దాటించిన విధానం ముచ్చటేసింది. మ్యాచ్ ముగిశాక యశస్వి, సర్ఫరాజ్, జురెల్ కలిసున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ ‘వీళ్లు ఈ తరం కుర్రాళ్లు’ అని క్యాప్షన్ ఇచ్చాడు. నిజమే కదా!