అడిలైడ్: పింక్ బాల్ టెస్ట్‌లో ఘోరంగా ఫెయిలైన టీమిండియా.. బ్రిస్బేన్‌లో శనివారం నుంచి జరిగే మూడో టెస్ట్‌పై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మంగళవారం నెట్ ప్రాక్టీస్‌లో తీవ్రంగా శ్రమించారు. మూడో టెస్ట్ కోసం ఆసీస్ ప్లేయర్లు ఇప్పటికే బ్రిస్బేన్‌కు వెళ్లిపోగా, రోహిత్‌సేన మాత్రం అడిలైడ్‌లో ప్రాక్టీస్ చేసింది. రెడ్ బాల్‌ను దీటుగా ఎదుర్కోవడం, టెక్నిక్, బాల్స్‌ను వదిలేయడం వంటి వాటిపై ఎక్కువగా ఫోకస్ చేసింది. ‘సిరీస్‌లో ముందంజ వేయాల్సిన టైమ్ వచ్చేసింది.
బ్రిస్బేన్ టెస్ట్ కోసం అడిలైడ్‌లోనే ప్రాక్టీస్ మొదలైంది’ అని బీసీసీఐ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. గత 12 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 142 రన్స్ మాత్రమే చేసిన రోహిత్ వీలైనంత త్వరగా గాడిలో పడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. దీంతో పేస్, స్పిన్ అనే తేడా లేకుండా నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. పింక్ టెస్టులో ఆరో ప్లేస్‌లో బ్యాటింగ్‌కు దిగిన హిట్‌మ్యాన్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 రన్సే చేశాడు. బోలాండ్, కమిన్స్ వేసిన ఫుల్లర్, ఫుల్ లెంగ్త్ బాల్స్‌కు ఎల్బీ, బౌల్డ్ అయ్యాడు.
ఇప్పుడు ప్రత్యేకంగా ఇలాంటి బాల్స్‌ను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టాడు. ఇక పెర్త్‌లో సెంచరీ చేసిన కోహ్లీ.. ఎడ్జింగ్ డెలివరీస్‌ను ఆడటాన్ని ప్రాక్టీస్ చేశాడు. కేఎల్ రాహుల్ ఎక్కువగా డిఫెన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వగా రిషబ్ పంత్ షాట్స్‌తో రెచ్చిపోయాడు. యశస్వి జైస్వాల్ అందరికంటే ఎక్కువగా నెట్స్‌లో చెమటోడ్చాడు.
మనోళ్ల బౌలింగ్‌లో ముందుకొచ్చి భారీ షాట్స్ ఆడాడు. పేసర్లు హర్షిత్ రాణా, ఆకాశ్‌దీప్, యష్ దయాల్‌తో పాటు స్పిన్ త్రయం జడేజా, అశ్విన్, సుందర్ బౌలింగ్ చేశారు. త్రో డౌన్ స్పెషలిస్ట్ కూడా వీళ్లకు సహకారం అందించాడు. విరాట్ కోహ్లీ సరదాగా బౌలింగ్ కూడా చేశాడు. కాగా, పేసర్లు బుమ్రా, సిరాజ్ మాత్రం జిమ్‌లో గడిపారు. బుధవారం టీమిండియా బ్రిస్బేన్‌కు బయలుదేరి వెళ్తుంది.