వైన్సుల్లో పర్మిట్ రూములను నియంత్రించాలి

వైన్సుల్లో పర్మిట్ రూములను నియంత్రించాలి
  • తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్

బషీర్​బాగ్/పంజాగుట్ట, వెలుగు: నాంపల్లిలోని ఆబ్కారీ శాఖ కార్యాలయం ముందు తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఆందోళనకు దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన ఓనర్స్ తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. బార్ల చుట్టూ వైన్ షాపుల్లో పర్మిట్ రూమ్‌‌‌‌‌‌‌‌లు ఉండడంతో కస్టమర్లు తగ్గిపోయి వ్యాపారం దెబ్బతింటుందని అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్  ఆరోపించారు. అంతకుముందు సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. 

వైన్స్ షాపు ఓనర్లు పర్మిట్ రూముల విషయంలో నిబంధనలకు బేఖాతరు చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అలాగే బెల్ట్ షాపులతో బస్తీల్లో ప్రజలకు అంతరాయం కలగడంతో పాటు తమ వ్యాపారానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. తక్షణమే వాటిని తొలగించాలని కోరారు.  తెలంగాణ అన్ని జిల్లాలలో వైన్స్ షాపు సమయం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటే ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో రాత్రి 11గంటల వరకు ఉందన్నారు. 

హైదరాబాద్ వైన్స్ షాపు లకు కూడా జిల్లాలో ఉన్న సమయాన్ని చేయాలన్నారు. ఈ మూడు సమస్యలపై చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్, గౌరవ అధ్యక్షుడు విజయ్ కుమార్   పాల్గొన్నారు.