
- మావోయిస్టుల కోసం రెండ్రోజులుగా కూంబింగ్
- హెలికాప్టర్‌లో బలగాలకు ఆయుధాలు, సరుకులు సరఫరా
- హిడ్మా దళం టార్గెట్‌గా ఎన్‌కౌంటర్!
జయశంకర్ భూపాలపల్లి/వెంకటాపురం, వెలుగు: రాష్ట్ర సరిహద్దులోని కర్రె గుటల్లో మావోయిస్టుల కోసం పోలీసుల కూంబింగ్ కొనసాగుతున్నది. హిడ్మా దళం ఆచూకీ కనిపెట్టేందుకు 12 వేల మందితో కూడిన భద్రతా బలగాలు అడవులను జల్లెడపడుతున్నాయి. తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దులోని ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లోని కర్రె గుటల్లో రెండ్రోజులుగా మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి.
చత్తీస్‌గఢ్ నుంచి దాదాపు 12 వేల మందితో కూడిన ప్రత్యేక బలగాలు మంగళవారం ఉదయం కర్రె గుట్టల్లోకి వెళ్లాయి. మావోయిస్టులు సేఫ్ జోన్‌గా ఏర్పరచుకున్న స్థావరాల వద్దకు పోలీస్ బలగాలు చేరు కున్నట్టు తెలుస్తున్నది. ఈ బలగాలకు అవసరమైన ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర సరుకులను హెలికాప్టర్‌లో సరఫరా చేస్తున్నారు. బుధవారం ఉదయం వెంకటాపురం మండల కేంద్రంలో రెండు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యాయి. ఆ హెలికాప్టర్ల నుంచి వాటర్ బాటిల్స్, కొన్ని బాక్సులు గుట్టల వద్దకు తీసుకుపోయినట్టు స్థానికులు చెబుతున్నారు.
అడవుల్లోకి రావొద్దని ప్రజలకు హెచ్చరిక..
అడవుల్లోకి రావొద్దని సమీప గ్రామాల ప్రజలకు రెండ్రోజుల క్రితమే పోలీసులు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తున్నది. విధుల్లో భాగంగా గుట్టల వద్దకు వెళ్లవద్దని ఉన్నతాధికారులు తెలిపినట్టు అటవీ శాఖ సిబ్బంది కూడా చెబుతున్నారు. రెండ్రోజులుగా గుట్టల్లో ఎన్‌కౌంటర్ జరుగుతున్నట్టు స్థానిక గిరిజనులు చెబుతున్నారు. అడవిలో కాల్పులు జరిగినట్టు, భారీగా శబ్దాలు వస్తున్నట్టు సమీప గ్రామాల్లోని ప్రజలు పేర్కొంటున్నారు. అయితే అసలు గుట్టల్లో ఏం జరుగుతున్నది? అనే వివరాలు మాత్రం పోలీసులు చెప్పడం లేదు.
పోలీస్ ఉన్నతాధికారులు వెంకటాపురం వస్తున్నట్టు బుధవారం ప్రచారం జరిగింది. దీంతో మావోయిస్ట్ అగ్ర నేత హిడ్మా దళం గురించి ఏవైనా వివరాలు వెల్లడిస్తారని భావించినా, ఉన్నతాధికారులు ఎవరూ రాలేదు. కాగా, కర్రె గుటల్లో కూంబింగ్ జరుగుతున్న మాట వాస్తవమేనని ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ చెప్పారు. చత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసులతో పాటు సీఆర్‌పీఎఫ్ బలగాలు అందులో పాల్గొంటున్నాయని బుధవారం తెలిపారు. అయితే ఎన్‌కౌంటర్‌లో ఎందరు చనిపోయారు? అనే విషయం తమకు తెలియదని చెప్పారు.