
- 44 డిగ్రీల మార్క్‌ను చేరుకున్న టెంపరేచర్లు
- ఆదిలాబాద్, నిర్మల్ తదితర జిల్లాల్లో భారీగా నమోదు
- ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే ప్రమాదం ఉందన్న ఐఎండీ
- నేడు 4 జిల్లాలు.. ఆ తర్వాత రెండ్రోజులు 6 జిల్లాలకు రెడ్ అలర్ట్
- ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు బయటకు రావొద్దని సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. నిరుడుతో పోలిస్తే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. గతేడాది కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువ టెంపరేచర్లు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో టెంపరేచర్లు ఇప్పటికే 44 డిగ్రీల మార్క్‌ను దాటాయి. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో వడగాడ్పులు తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
బుధవారం నాలుగు జిల్లాలకు.. గురు, శుక్రవారాల్లో ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. గురువారం, శుక్రవారాలకు ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. మిగతా అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్క్‌నూ దాటే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించింది.
బయటకు రావొద్దు..
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగే ప్రమాదం ఉండడంతో వృద్ధులు, చిన్నపిల్లలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావొద్దని చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఆ టైంలో బయటకు వస్తే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నీటి కంటెంట్ ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కీర, కర్బూజ వంటి పండ్లు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. డీహైడ్రేట్ కాకుండా నిమ్మరసాలు, కొబ్బరి బోండాలు, ఎలక్ట్రోలైట్స్ ద్రావణాలు తీసుకోవాలని చెబుతున్నారు.
పలు చోట్ల వర్షం..
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం సాయంత్రం తేలికపాటి వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ సిటీతో పాటు యాదాద్రి, జనగామ, వికారాబాద్, మంచిర్యాల, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, ఖమ్మం, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. హైదరాబాద్ సిటీలోని ఎల్బీ నగర్, అల్కాపురి, నాగోల్, ముషీరాబాద్, దిల్సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. అత్యధికంగా ఎల్బీ నగర్లో 1.5 సెంటీమీటర్ల వర్షం పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో 7.8 మిల్లీమీటర్లు, జనగామలో 7.5 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. రాబోయే రెండు మూడు రోజుల్లో పలుచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మంగళవారం మంట..
మంగళవారం అన్ని జిల్లాల్లోనూ ఆరెంజ్ అలర్ట్‌లోనే టెంపరేచర్లు రికార్డయ్యాయి. నిరుడు ఇదే రోజుతో పోలిస్తే ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. గతేడాది ఈ రోజున 8 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్‌లో ఉష్ణోగ్రతలు ఉంటే.. ఇప్పుడు రాష్ట్రమంతా ఆరెంజ్ అలర్ట్‌లోకి వెళ్లిపోవడం ఎండ తీవ్రతకు అద్దం పడుతున్నది. మంగళవారం రెండు జిల్లాల్లో 44 డిగ్రీలు, 9 జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా, 9 జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా తాంసి, నిర్మల్ జిల్లా నర్సాపూర్‌లో 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
జగిత్యాల, జోగుళాంబ గద్వాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 43.8 డిగ్రీలు, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో 43.7, కామారెడ్డి, రాజన్నసిరిసిల్లలో 43.6, కరీంనగర్లో 43.5, పెద్దపల్లి జిల్లాలో 43.4 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదయ్యాయి. అత్యల్పంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా జిల్లాల్లో 41 డిగ్రీల నుంచి 42.8 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.