- కొత్త రేషన్ కార్డుల జారీపై చర్చించే అవకాశం
- టూరిజం పాలసీకి ఆమోదం తెలిపే చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్ ఈ నెల 4వ తేదీన భేటీ కానున్నది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియెట్‌లో జరగనున్న ఈ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. కుల గణన సర్వే పూర్తి కావడంతో కేబినెట్లో చర్చించి ఆమోదం తెలుపుతారని చర్చ జరుగుతున్నది. రైతు భరోసా విధి విధానాలు, భూమి లేని రైతు కూలీలకు అందజేసే ఆర్థిక సాయంపై డిస్కస్ చేయనున్నట్లు సమాచారం. కొత్త రేషన్ కార్డులకు ఆదాయపరిమితి, దరఖాస్తుల స్వీకరణపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకు సబ్సిడీ ధరలతో ఇసుక, సిమెంట్, స్టీల్ వంటి ముడి సరుకులు సరఫరా చేయాలన్న ప్రతిపాదన కేబినెట్లో చర్చకు రానున్నట్లు సమాచారం. విద్యుత్ కమిషన్, బీసీ డెడికేషన్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికలపై కూడా చర్చించే అవకాశం ఉన్నది. కొత్త రేషన్ కార్డులు, టూరిజం పాలసీపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. యాదగిరిగుట్ట దేవాలయానికి టీటీడీ తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటుపై మంత్రిమండలి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉన్నది. యాదగిరిగుట్ట ఆలయానికి 20 మందితో పాలక మండలి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.
ఇటీవల జరిగిన శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో కొత్త టూరిజం పాలసీపై చర్చించారు. ఈ పాలసీకి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీన్ని డిసెంబర్ నుంచే అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా వెల్లడించారు. కానీ.. అది అమల్లోకి రాలేదు. దీంతో ఈ స్కీమ్ అర్హతలపై కేబినెట్లో చర్చించి ఫైనల్ చేసే అవకాశం ఉన్నది. వీటితో పాటు ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థల ఎన్నికల లాంటి ప్రధాన అంశాలు చర్చకు రానున్నట్లు సమాచారం. వాస్తవానికి డిసెంబర్ 30నే మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కన్నుమూయడంతో వారం పాటు సంతాప దినాలు నిర్వహిస్తున్నారు. దీంతో కేబినెట్ భేటీ వాయిదా పడింది.