- భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లు అత్యంత ప్రతిష్టాత్మకం: సీఎం రేవంత్
- భూభారతి చట్టాన్ని గ్రామ స్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలి
- ప్రతి మండలంలో అవగాహన సదస్సులు నిర్వహించాలి
- ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు
- కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి దిశానిర్దేశం
హైదరాబాద్, వెలుగు: భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమని, వీటిని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్లను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ మేరకు ఆయన దిశానిర్దేశం చేశారు. ‘భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లను సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏ దశలోనూ ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఈ రెండింటినీ క్షేత్ర స్థాయిలో పకడ్బందీగా అమలుచేయండి’ అని ఆదేశించారు.
భూ భారతి చట్టాన్ని ముందుగా కలెక్టర్లు సమగ్రంగా అధ్యయనం చేయాలని, ఆ తర్వాత ప్రతి మండలంలో అవగాహన సదస్సులు నిర్వహించి, కలెక్టర్లు తప్పనిసరిగా హాజరై, రైతుల సందేహాలకు సమాధానాలు చెప్పాలన్నారు. గ్రామస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకే భూభారతి చట్టం తెచ్చామన్నారు. ఇన్నాళ్లూ భూ సమస్యలపై రైతులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ఇప్పుడు రెవెన్యూ శాఖే గ్రామాలకు వెళ్లి వారి సమస్యల్ని పరిష్కరిస్తుందన్నారు.
భూ భారతి పైలెట్ ప్రాజెక్టు సదస్సులను నారాయణపేట జిల్లా మద్దూర్, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాల్లో నిర్వహిస్తారన్నారు. ఆయా మండల కేంద్రాల్లో సదస్సులకు కలెక్టర్లు కచ్చితంగా హాజరుకావాలని, ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బందితో సదస్సులు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర మంత్రులు కూడా ఈ సదస్సుల్లో పాల్గొంటారని చెప్పారు.
కలెక్టర్లు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని సీఎం తెలిపారు. గ్రామ స్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు ఆమోదం పొందిన జాబితాను మండల స్థాయి కమిటీలు పరిశీలించాలన్నారు. ఆ కమిటీల పరిశీలన అనంతరం జిల్లా ఇన్‌చార్జి మంత్రికి పంపాలని.. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదించాకే ఇండ్ల జాబితా ఖరారవుతుందని స్పష్టం చేశారు. ఈ మొత్తం పర్యవేక్షణకు నియోజకవర్గానికో ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు.
ఈ ప్రత్యేకాధికారి ఇందిరమ్మ కమిటీలు, మండల కమిటీలు, కలెక్టర్లు, ఇన్‌చార్జి మంత్రి మధ్య సమన్వయకర్తగా ఉంటారని సీఎం తెలిపారు. గతంలో ఉమ్మడి జిల్లాకు నియమించిన సీనియర్ అధికారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై దృష్టి సారించాలని, ఆయా జిల్లాల కలెక్టర్లతో పర్యవేక్షణ చేయాలన్నారు. ఇండ్ల మంజూరులో ఏ దశలోనూ ఎవరూ ఎటువంటి ఒత్తిళ్లకూ తలొగొద్దని, ఎక్కడైనా అనర్హులకు ఇండ్లు కేటాయిస్తే మండలస్థాయి కమిటీ, ప్రత్యేకాధికారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయించినందున జనాభా ప్రాతిపదికన, ఆయా గ్రామాలకు ఇండ్ల కేటాయింపు ఉండాలని, ఈ విషయంలో హేతుబద్ధత పాటించాలన్నారు. నిర్దేశిత సమయం ఆధారంగా ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని, ఇందుకు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీఎం ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, అధికారులు, కలెక్టర్లు పాల్గొన్నారు.