హైదరాబాద్, వెలుగు: అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన కామెంట్లను వ్యతిరేకిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మంగళవారం హైదరాబాద్ లో నిరసన చేపట్టనున్నారు. ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం నుంచి లక్డీకపూల్ లోని హైదరాబాద్ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పలువురు మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొననున్నారు.
దీన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ కేడర్ పెద్ద సంఖ్యలో తరలిరావాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. అమిత్ షాను వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్ చేశారు.