సైబర్ నేరగాళ్లకు సీఎస్​బీ షాక్

సైబర్ నేరగాళ్లకు సీఎస్​బీ షాక్
  • రూ.1.95 కోట్లు విత్ డ్రా చేయకుండా అకౌంట్ ఫ్రీజ్
  • సీఎండీ డీపీతో అకౌంట్స్ ఆఫీసర్​కు వాట్సాప్ మెసేజ్
  • డబ్బులు ట్రాన్స్​ఫర్ చేసిన అధికారి
  • మోసపోయానని గుర్తించిన కంపెనీ సీఎండీ
  • ఎన్​సీఆర్​పీలో ఫిర్యాదు.. రెండు గంటల్లోనే ఖాతా ఫ్రీజ్ 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఓ కంపెనీ అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు కొట్టేసిన రూ.1.95 కోట్లను విత్ డ్రా చేయకుండా రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్​బీ) అడ్డుకున్నది. కొన్ని గంటల వ్యవధిలోనే అకౌంట్​ను ఫ్రీజ్ చేయించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఎస్​బీ డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడించారు. హైదరాబాద్​లోని ఓ ప్రముఖ కన్​స్ట్రక్షన్ కంపెనీలో పని చేస్తున్న అకౌంట్స్ ఆఫీసర్​కు గురువారం వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది. వాట్సాప్ డీపీగా కంపెనీ సీఎండీ ఫొటో ఉంది.

కొత్త ప్రాజెక్ట్ కోసం డబ్బులు పంపించాల్సి ఉంది. ఎస్ఎంఎస్​లో పేర్కొన్న డీబీఎస్ బ్యాంక్ అకౌంట్​కు వెంటనే 1.95 కోట్లు అడ్వాన్స్​గా చెల్లించండి’’అని మెసేజ్​లో ఉన్నది. దీంతో సదరు అకౌంట్స్ ఆఫీసర్ మధ్యాహ్నం 1.02 గంటలకు కంపెనీ అకౌంట్ నుంచి జైపూర్​లోని డీబీఎస్ అకౌంట్​కు రూ.1.95 కోట్లు బదిలీ చేశాడు. రూ.1.95 కోట్లు ట్రాన్స్​ఫర్ అయినట్లు కంపెనీ సీఎండీకి బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది.

జైపూర్ అకౌంట్​కు డబ్బులు ట్రాన్స్​ఫర్

తన ప్రమేయం లేకుండానే డబ్బులు ట్రాన్స్​ఫర్ అయినట్లు గుర్తించిన సీఎండీ.. మోసం జరిగిందని తెలుసుకుని వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్​సీఆర్​పీ)లో కంప్లైంట్ చేశాడు. ఎన్​సీఆర్​పీలో అప్​లోడ్ అయిన కంప్లైంట్​ను తెలంగాణ స్టేట్ సీఎస్​బీ అధికారులు పరిశీలించారు. ట్రాన్సాక్షన్​కు సంబంధించిన సరైన వివరాలు లేకపోవడంతో ఆ కంపెనీ నుంచి ఫిర్యాదు చేసిన వారిని అధికారులు సంప్రదించారు. అయితే, అప్పటికే మోసానికి గురైన సీఎండీ.. సీఎస్​బీ అధికారులు ఫోన్ చేసినా కొంత అనుమానం వ్యక్తం చేశాడు. 

సీఎస్​బీ మొత్తం వివరాలు వెల్లడించడంతో నగదు బదిలీకి సంబంధించిన స్క్రీన్ షాట్లు ఇచ్చాడు. దీంతో మధ్యాహ్నం 2.51 గంటల సమయంలో సీఎస్​బీ అధికారులు డబ్బు డిపాజిట్ అయిన జైపూర్​లోని డీబీఎస్ బ్యాంక్ నోడల్ అధికారులతో సమన్వయం చేసుకున్నారు. అప్పటికే రెండు గంటలు గడిచిపోయాయి. డీబీఎస్ అకౌంట్​లో అలాగే ఉన్న రూ.1.95 కోట్లను సైబర్ నేరగాళ్లు విత్ డ్రా చేయకుండా ఫ్రీజ్ చేశారు. వాట్సాప్, ఈ మెయిల్, ఫోన్ ద్వారా వచ్చే మనీ రిక్వెస్ట్​లతో జాగ్రత్తగా ఉండాలని శిఖాగోయల్ సూచించారు. తెలియని వారికి డబ్బులు ట్రాన్స్​ఫర్ చేయవద్దని చెప్పారు.