గోదావరిలో జలాల్లో ఏపీ 493 టీఎంసీలే వాడుకోవాలి

  • కృష్ణా నీళ్లపై కొత్త ట్రిబ్యునల్‌‌‌‌ ఏర్పాటు చేయండి
  • అప్పటి వరకు రెండు రాష్ట్రాలకు చెరిసగం నీళ్లివ్వండి
  • కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ లేఖలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: గోదావరి జలాల్లో ఏపీ 493.5 టీఎంసీలకు మించి వాడుకోకుండా కట్టడి చేయాలని కేంద్ర జలశక్తి శాఖను తెలంగాణ కోరింది. పోలవరం ఆధారంగా ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులన్నీ నిలిపి వేయించాలని డిమాండ్‌‌‌‌ చేసింది. కృష్ణా నీళ్లను తెలంగాణ, ఏపీ మధ్య పునః పంపిణీ చేయడానికి వెంటనే ట్రిబ్యునల్‌‌‌‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి  చేసింది. ఈ మేరకు ఇరిగేషన్‌‌‌‌ స్పెషల్‌‌‌‌ సీఎస్‌‌‌‌ రజత్‌‌‌‌ కుమార్‌‌‌‌ మంగళవారం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌‌‌‌ కుమార్‌‌‌‌కు రెండు లేఖలు రాశారు.

అక్రమ ప్రాజెక్టులతో గోదావరి డెల్టాకు ఎఫెక్ట్
పోలవరం నుంచి రోజుకు 1.7 టీఎంసీల చొప్పున మొత్తంగా 449.78 టీఎంసీలు మాత్రమే తీసుకునేందుకు ఏపీకి సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చిందని రజత్​కుమార్ లేఖలో గుర్తు చేశారు. ఏపీ మాత్రం కాలువల విస్తరణ చేపట్టి రోజుకు 3 టీఎంసీల నీటిని వాడుకునే ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. ఏపీ ఎక్కువ నీటిని తీసుకుంటే ఎగువనున్న తెలంగాణపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. పోలవరం ఆధారంగా చేపట్టిన పుష్కర (11.8 టీఎంసీలు), చెంగల్నాడు (2.85), తొర్రిగడ్డ (2.41), తాడిపూడి (11.47), పట్టిసీమ (80 టీఎంసీలు) లిఫ్ట్‌‌‌‌ స్కీంలకు నీటిని కోరే హక్కు ఏపీకి లేదని పేర్కొన్నారు. కృష్ణా–పెన్నా లింక్‌‌‌‌ పేరుతో 350 టీఎంసీలు తరలించే ప్రాజెక్టుకు గోదావరి బోర్డు, అపెక్స్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ అనుమతులు లేవన్నారు. బచావత్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌ ప్రకారం ఏపీకి 493.50 టీఎంసీలు మాత్రమే దక్కుతాయన్నారు.

కేఆర్​ఎంబీ నీటి పంపకాలు ఏకపక్షం
రెండో అపెక్స్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ నిర్ణయానికి లోబడి కృష్ణా నీళ్ల పంపిణీపై సుప్రీం కోర్టులో ఉన్న కేసు తెలంగాణ విత్‌‌‌‌డ్రా చేసుకుందని స్పెషల్ సీఎస్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే నీటి పంపకాలకు ట్రిబ్యునల్‌‌‌‌ ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీశైలం రిజర్వాయర్‌‌‌‌ నుంచి కేటాయించిన దానికంటే ఎక్కువ నీటిని తీసుకుంటూ ఏపీ ఈ రూల్స్ అతిక్రమిస్తోందన్నారు. నిర్మాణంలో ఉన్న, పాత ప్రాజెక్టులు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలు కలుపుకుంటే తెలంగాణకు 575 టీఎంసీల నీరు అవసమని వివరించారు. కృష్ణా బోర్డు మే 27న విడుదల చేసిన కేఆర్‌‌‌‌ఎంబీ మీటింగ్‌‌‌‌ మినిట్స్‌‌‌‌లో 66:34 నిష్పత్తిలో నీటి పంపకాలు చేసినట్టుగా పేర్కొందన్నారు. ఏపీ రీ ఆర్గనైజేషన్‌‌‌‌ యాక్ట్‌‌‌‌లోని 84(3)(3) క్లాజ్‌‌‌‌ కూడా ఇదే చెప్తోందన్నారు. తెలంగాణ కాన్సెంట్‌‌‌‌ ఇవ్వకున్నా బోర్డు ఏకపక్షంగా నీటి పంపకాలు చేసిందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ జోక్యం చేసుకొని వెంటనే రెండు రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.