
- క్రైమ్ రివ్యూలో అధికారులకు డీజీపీ జితేందర్ సూచన
హైదరాబాద్,వెలుగు: సోషల్ మీడియాలో వ్యాప్తి చెందే ఫేక్ న్యూస్ పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ జితేందర్ అన్నారు. మార్ఫింగ్ వీడియోలు, ఫొటోల ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందన్నారు. క్రైమ్ రివ్యూలో భాగంగా సోమవారం డీజీపీ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఇందులో లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్ భగవత్, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి, సీఐడీ చీఫ్ శిఖాగోయల్ సహా పలువురు అడిషనల్ డీజీలు, ఐజీలు, సీపీలు, డీసీపీలు, గాంధీ హాస్పిటల్ ఫోరెన్సిక్ మెడిసిన్ హెడ్ కృపాకర్ సింగ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ..కంచ గచ్చిబౌలి భూముల నేపథ్యంలో నెల్లకొన్న ఉద్రిక్తతలు, ఫేక్ న్యూస్ ప్రచారం సంబంధిత అంశాలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసుల దర్యాప్తు వివరాలను తెలుసుకున్నారు. పోలీసులపై ప్రజల్లో విశ్వాసం కలిగించే విధంగా సర్వీస్ అందించాలని సూచించారు.ప్రజా భద్రతకు భరోసా ఇచ్చే విధంగా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. మహిళల అభివృద్ధి కోసం ఉమెన్ పోలీస్ ఆఫీసర్లతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు.
సీఐడీ డీజీ శిఖాగోయల్ మాట్లాడుతూ..క్రైమ్ రేటు 2024 జూలై నుంచి జనవరి వరకు ఆరు నెలలతో పోల్చితే ఈ ఏడాది 4.9 శాతం తగ్గిందని తెలిపారు. దొంగతనాలు మినహా మేజర్ క్రైమ్‌లో 2023లో 57 శాతం డిటెక్షన్ గతేడాది 76 శాతం పెరిగిందన్నారు. విచారణలో ఉన్న కేసుల్లో డిస్పోజల్ 20.49 శాతానికి పెరిగిందని వివరించారు. సమావేశంలో రాచకొండ సీపీ సుధీర్‌బాబు, రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, ఖమ్మం కమిషనర్ సునీల్ దత్, హైదరాబాద్ సీసీఎస్ డీసీపీ శ్వేతరెడ్డి, వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్, మాదాపూర్ డీసీపీ వినీత్ పాల్గొని, కేసుల దర్యాప్తు వివరాలను వెల్లడించారు.