
- స్పీడ్ అందుకోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పెండింగ్ పనులు
- పనుల కోసం నిధుల మంజూరు
- డబుల్ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న ప్రజలు
మహబూబాబాద్, వెలుగు: గత రాష్ట్ర ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 26,284 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేసినా, కొన్నిచోట్లనే నిర్మాణాలు పూర్తి చేసి, పంపిణీ చేశారు.
అనేక చోట్ల వివిధ దశల్లో డబుల్ బెడ్రూమ్ల పనులు నిలిచిపోగా, కొన్నిచోట్ల నేటికీ పనులు ప్రారంభించలేదు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కొత్తగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తూ, గతంలో వివిధ దశల్లో నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు చేపట్టడానికి 2025_26 రాష్ట్ర బడ్జెట్లో రూ.305.03 కోట్లను మంజూరు చేయడంతో మళ్లీ ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ..
గతంలో వివిధ కారణాలతో డబుల్ బెడ్రూమ్నిర్మాణ పనులు వివిధ దశల్లో నిలిచిపోగా, తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో ఆఫీసర్లు కాంట్రాక్టర్లకు నోటీసులను జారీ చేస్తున్నారు. పెండింగ్‌పనులు చేపడితే బిల్లులు చెల్లిస్తామని తెలుపుతున్నారు. కొంతమంది కాంట్రాక్టర్లు మెటీరియల్ కాస్ట్ పెరుగడంతో నిర్మాణానికి ముందుకు రాకుంటే వారి కాంట్రాక్ట్‌ను రద్దు చేసి, కొత్త వారికి నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వ ఆదేశాలతో ముందుకు సాగడానికి సిద్ధమవుతున్నారు.
జిల్లాల వారీగా డబుల్ బెడ్ రూమ్‌ల వివరాలు
జిల్లా మంజూరైన ఇండ్లు పూర్తైనవి వివిధ దశల్లో ఉన్నవి ప్రారంభం కానివి
మహబూబాబాద్ 5567 2503 1963 1101
హనుమకొండ 4326 2143 2076 107
జయశంకర్భూపాలపల్లి 3882 1613 926 1343
జనగామ 4393 1454 1566 1373
ములుగు 1783 916 620 247
వరంగల్లు 6333 2300 1503 2530
పెండింగ్ పనులను పూర్తి చేయాలి
తొర్రూరు పట్టణ కేంద్రంలో ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు వివిధ కారణాలతో, వివిధ దశల్లో పనులు నిలిచిపోయాయి. పట్టణంలో సొంత ఇంటి స్థలం లేక నిరుపేదలు ఇండ్లను నిర్మించుకో లేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతోపాటు, పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తిచేసి నిరుపేదలకు అందజేశారు. వెంటనే పనులు ప్రారంభమయ్యేలా ఆఫీసర్లు, అధికార పార్టీ నాయకులు కృషి చేయాలి.- అలిసేరి రవిబాబు, తొర్రూరు పట్టణం