- ఆకునూరి మురళి
హైదరాబాద్, వెలుగు: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) రూపొందించిన కొత్త రెగ్యులేషన్స్ డ్రాఫ్ట్ పై గురువారం సెమినార్ నిర్వహించనున్నట్టు తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలిపారు. ఎస్సీఈఆర్టీ క్యాంపస్‌లోని గోదావరి హాల్లో రేపు మధ్యాహ్నం 2 గంటలకు ‘యూజీసీ రెగ్యులేషన్–స్టేట్ యూనివర్సిటీల్లో జోక్యం’ అనే అంశంపై చర్చించనున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించేలా యూజీసీ వ్యవహరించడంపై ఇప్పటికే పలు రాష్ర్టాలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.
ప్రజాభిప్రాయాలను సేకరించి కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాలు యూజీసీ డ్రాఫ్ట్ ను వ్యతిరేకిస్తూ ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాయని పేర్కొన్నారు. ఈ సెమినార్ లో వర్సిటీల వీసీల నియామకం, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంపై చర్చించనున్నట్టు తెలిపారు.
నేడు బెంగళూరులో సీఎంల సమావేశం
కేంద్ర ప్రభుత్వం ద్వారా యూజీసీ తీసుకొచ్చిన గైడ్‌లైన్స్ పై జాతీయ స్థాయిలో చర్చించేందుకు బుధవారం బెంగళూరులో సీఎంల సమావేశం జరగనున్నది. బీజేపీ పాలిత రాష్ర్టాలు మినహా మిగిలిన రాష్ర్టాల సీఎంలకు ఈ సమావేశానికి సంబంధించిన ఆహ్వానాన్ని కర్నాటక ప్రభుత్వం పంపించినట్టు తెలుస్తోంది. దీంట్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి శ్రీధర్ బాబుతో పాటు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా తదితరులు పాల్గొననున్నట్టు సమాచారం.