మహబూబ్​నగర్​లో కాంగ్రెస్, బీజేపీకి షాక్

మహబూబ్​నగర్​లో కాంగ్రెస్, బీజేపీకి షాక్

హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ లీడర్లు ఆదివారం బీఆర్ఎస్​లో చేరారు. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత ఎర్ర శేఖర్ బేగంపేట క్యాంపు ఆఫీస్​లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్​లో చేరారు. మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు పి.చంద్రశేఖర్ తెలంగాణ భవన్​లో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో కారెక్కారు. తర్వాత కేటీఆర్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఎర్ర శేఖర్.. జడ్చర్ల, నారాయణపేటలో ఏదో ఒక స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. రెండూ దక్కకపోవడంతో పార్టీ వీడారు. ఆయనకు కేటీఆర్ కండువా కప్పి బీఆర్ఎస్​లోకి ఆహ్వానించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీసీల ఆర్థిక స్థితిగతులు మారాయని, ఆత్మగౌరవంతో బతికేలా కేసీఆర్ ఎన్నో స్కీమ్​లు తీసుకొచ్చారని ఎర్ర శేఖర్ అన్నారు. పి.చంద్రశేఖర్  మాట్లాడుతూ.. తెలంగాణ సాధించిన తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బీఆర్ఎస్ వీడానని అన్నారు.