వీరేశం రాకకు లైన్​ క్లియర్!

నల్గొండ, వెలుగు: బీఆర్ఎస్​కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే  వేముల వీరేశం కాంగ్రెస్​లో చేరేందుకు లైన్​ క్లియరైంది. ఇన్నాళ్లూ ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న  పార్టీలోని ఓ వర్గం అధిష్టానం బుజ్జగింపుతో మెత్తబడినట్టు సమాచారం. నకిరేకల్​ సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను దెబ్బతీయాలంటే వీరేశంను పార్టీలోకి తీసుకోవాలని నియోజకవర్గానికి చెందిన కొందరు నేతలు మొదటి నుంచీ అభిప్రాయపడుతున్నారు. అయితే వీరేశం రాకను గట్టిగా అడ్డుకుంటున్న ఓ వర్గం వెనుక ఎమ్మెల్యే చిరుమర్తి ఉన్నారని ప్రచారం జరిగింది. 

అందువల్లే వీరేశం చేరిక ఆలస్యమైనట్టు చెబుతున్నారు. కానీ ఇటీవల ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డితోపాటు, నల్గొండ జిల్లాకు చెందిన మరో కీలక నేత రంగంలోకి  దిగి జిల్లాకు చెందిన సీనియర్లతో చర్చలు జరిపారు. నకిరేకల్ టికెట్ ఆశిస్తున్న వారికి సర్దిచెప్పే బాధ్యత కూడా వారు తీసుకున్నట్లు తెలిసింది. ముఖ్యంగా వీరేశం రాకను పరోక్షంగా వ్యతిరేకించిన ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి సైతం చర్చల తర్వాత ఓకే చెప్పినట్టు సమాచారం. మొత్తం మీద వీరేశం కాంగ్రెస్​లోకి రావడం ఖాయమైందని, అధికారిక ప్రకటనే మిగిలి ఉందని జిల్లా కాంగ్రెస్​ వర్గాలు వెల్లడించాయి.