జులై 2023 నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త పీఆర్సీపై రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ తొలి పీఆర్సీ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర నష్టం చేసింది. 33 నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించకుండా మొండిచెయ్యి చూపింది. ఈ నష్టాన్ని భర్తీ చేసే విధంగా తెలంగాణ రెండో పీఆర్సీ ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ సర్కార్ అని మాటల్లో చెప్తూనే చేతల్లో అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. తాను నియమించిన తొలి పే రివిజన్ కమిషన్ చేసిన.. శిశు సంరక్షణ సెలవులు పెంపు, 20 ఏండ్ల సర్వీస్‌కే పూర్తి పెన్షన్, అలవెన్సుల పెంపు వంటి కీలక సిఫారసులను కేసీఆర్ సర్కారు అమలు చేయలేదు. పీఆర్సీ గడువు ఐదేండ్లు ముగిసినా పీఆర్సీ చేసిన అనేక సిఫారసులపై జీవోలు జారీ చెయ్యలేదు.
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదు. సమస్యలు చెప్పుకోవడానికి సంఘ ప్రతినిధులకు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా నాటి ప్రభుత్వం ఘోరంగా అవమానించింది. ప్రభుత్వ పెద్దలు దయతలచి ఇవ్వడమే తప్ప, సంఘాలతో చర్చలు, సంప్రదింపులు ప్రసక్తే ఉండేది కాదు. కుక్క తోకను ఊపుతుందా? తోక కుక్కను ఊపుతుందా అంటూ చులకన చేసి మాట్లాడారు. తమ అహంకారపూరిత ప్రవర్తనతో రాష్ట్రంలోని మూడున్నర లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని నాటి పాలకులు మంటగలిపారు. కనీసం ప్రతినెలా ఒకటో తేదీనాడు చెల్లించాల్సిన జీతాలు గురించి కూడా కేసీఆర్ సర్కారు ఏనాడూ పట్టించుకోలేదు. రోజుకి కొన్ని జిల్లాల చొప్పున జీతాలు చెల్లించి, ఒక్కో నెల మూడవ వారం వరకూ సాగదీశారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జీతాల చెల్లింపు సమస్యను పరిష్కరించారు. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు అందరికీ ఒకటో తేదీనాడే జీతాలు, పెన్షన్లు పడుతున్నాయి. పీఆర్సీ అమలు విషయంలోనూ ఇదే ఒరవడి చూపాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు.
హేతుబద్ధంగా హెచ్ఆర్ఏ స్లాబులు
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లిస్తున్న ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ)లో భారీ వ్యత్యాసం ఉన్నది. గ్రామాలకు 16 శాతం, మున్సిపాలిటీలకు 18 శాతం, అన్ని జిల్లా కేంద్రాలు, మున్సిపల్ కార్పొరేషన్లు 20 శాతం, జీహెచ్ఎంసీ పరిధిలో 24 శాతం హెచ్ఆర్ఏ నిర్ధారించాలి. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు మూలవేతనంపై 10 శాతం, గరిష్టంగా రూ.8000 రిమోట్ అలవెన్స్ చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్టే మహిళా ఉద్యోగులు, టీచర్లకు రెండేళ్ల చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేయాలి. అన్ని శాఖల్లోని ఉద్యోగులకు ఏటా 30 సంపాదిత సెలవులు మంజూరు చేస్తూ, విద్యాశాఖలో పనిచేస్తున్న టీచర్లకు వెకేషన్ డిపార్ట్‌మెంట్ అని ముద్రవేసి కేవలం ఆరు మాత్రమే ఇస్తున్నారు. వీటిని పదకొండుకి పెంచాలి. నగదు రహిత వైద్యానికి గత ప్రభుత్వం ఉత్తర్వులిచ్చి కూడా పథకాన్ని అమలు చేయలేదు. సత్వరం క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ విధివిధానాలు ఖరారు చేసి అమల్లోకి తేవాలి. అప్పటివరకు పరిమితి లేకుండా మెడికల్ రీయింబర్స్‌మెంట్ అనుమతించాలి. కేజీబీవీ, యుఆర్ఎస్, సమగ్ర శిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలి. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరణిస్తే, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మరణించిన ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పథకం కింద ఉద్యోగం కల్పించాలి.
40 శాతం ఫిట్మెంట్
ద్రవ్యోల్బణం కారణంగా రూపాయి కొనుగోలు శక్తి క్షీణించి, ఉద్యోగ, ఉపాధ్యాయుల నిజవేతనాలు క్రమంగా తగ్గుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం 40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి. ఐదు రాష్ట్రాల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంని ఎత్తివేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేస్తామని ఉద్యోగులకు హామీ కూడా ఇచ్చింది. పే రివిజన్ కమిటీ ప్రభుత్వానికి ఈ మేరకు సిఫారసు చేయాలి . విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇరవై, ఇరవై ఐదు ఏండ్ల సర్వీస్ పూర్తి చేసినా కనీసం ఒక్క ప్రమోషన్‌కి కూడా నోచుకోవడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్రయత్న పదోన్నతి స్కేళ్లను 5/10/15/20/25 సంవత్సరాలుగా మార్చాలి. 25 సంవత్సరాల సర్వీస్‌కి ఎస్ఎస్‌పీ-2బి స్కేల్ మంజూరు చేయాలి. హైస్కూళ్లలో ఉన్నత తరగతులు బోధిస్తున్న భాషాపండితులు, ఎస్జీటీలకు హయ్యర్ క్లాస్ హ్యాండ్లింగ్ అలవెన్స్ నెలకు కేవలం రూ.150 మాత్రమే చెల్లిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం అక్కడి టీచర్లకు ఎప్పటి నుంచో ప్రతినెలా రూ.2500 ఇస్తున్నది. మన రాష్ట్రంలో నెలకు రూ.3000 మంజూరుకు రికమండ్ చేయాలి.
గ్రాట్యుటీ రూ.28 లక్షలకు పెంచాలి
2016 నుంచే కేంద్ర ప్రభుత్వం సహా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు రూ.20 లక్షలు రిటైర్మెంట్ గ్రాట్యుటీ చెల్లిస్తున్నాయి. కానీ, తెలంగాణలో కేవలం రూ.16 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని రూ.28 లక్షలకు పెంచాలి. రిటైర్మెంట్ సందర్భంగా ఉద్యోగులకు చెల్లించే కమ్యూటేషన్ మొత్తం పదకొండు ఏండ్లలోనే ప్రభుత్వం తిరిగి రాబట్టుకుంటోంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని, కమ్యూట్ చేసిన పెన్షన్ మొత్తాన్ని రిస్టోర్ చేసే కాలాన్ని 15 నుంచి 11 ఏండ్లకు తగ్గించాలి. గత కొన్నేండ్లుగా రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు ఆలస్యం అవుతున్నాయి. ముప్పై ఐదు, నలభై ఏండ్ల వయస్సులో ఉద్యోగాలు పొంది, తక్కువ కాలం సర్వీస్‌కే ఉద్యోగం నుంచి రిటైర్ అవుతున్నందున పూర్తి పెన్షన్ పొందే సర్వీస్‌ని 20 సంవత్సరాలకు తగ్గించాలి. మంచి పీఆర్సీ కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా స్పందించాలి. ఆ వెంటనే ఉద్యోగవర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా పీఆర్సీ నివేదిక తెప్పించుకొని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలతో చర్చించి ఆమోద యోగ్యమైన ఫిట్మెంట్ ప్రకటించాలి.
- మానేటి ప్రతాపరెడ్డి
టీఆర్‌టీఎఫ్ గౌరవాధ్యక్షుడు