ఎనిమిది సెట్లకు తేదీలు ఖరారు.. ఏప్రిల్‌ 29 నుంచి జూన్‌ 19 వరకు పరీక్షల నిర్వహణ

  • ఏప్రిల్‌ 29 నుంచి జూన్‌ 19 వరకు పరీక్షల నిర్వహణ
  • ఏప్రిల్​ 29, 30న అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రెన్స్ టెస్ట్‌
  • మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కు ఎగ్జామ్ 
  • ఎంట్రెన్స్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేసిన  హయ్యర్‌‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్ 

హైదరాబాద్, వెలుగు: పలు ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు బుధవారం ఎంట్రెన్స్ టెస్టుల తేదీలను రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్‌ఈ) విడుదల చేసింది. ఏప్రిల్ 29 నుంచి ప్రారంభమై.. జూన్‌ 19 వరకు ఈ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ జరగనున్నాయి. ఏటా మే నెల నుంచి ప్రారంభమయ్యే ప్రవేశ పరీక్షలు.. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే మొదలు కానున్నాయి. ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ రిలీజ్‌ చేశారు. 

పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని ప్రకటించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ (పీఈ సెట్) మాత్రమే ఫిజికల్, స్కిల్ టెస్టులు పెట్టనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈఏపీ (ఎంసెట్‌‌‌‌) సెట్‌‌‌‌ ఏప్రిల్‌‌‌‌ 29 నుంచి మే 5 వరకు నిర్వహించనున్నారు. నీట్ (యూజీ) ఎగ్జామ్ మే 6 నుంచి పది రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. దీంతో ఈ ఏడాది అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌‌‌‌కు ముందుగా ఎగ్జామ్స్ పెడుతున్నారు. నీట్ ప్రిపేర్ అయ్యే బైపీసీ విద్యార్థులు వారం రోజుల టైమ్ ఉండేలా కౌన్సిల్ అధికారులు చర్యలు తీసుకున్నారు. 

ఎప్ సెట్ ఆరు రోజులు, పీజీఈ సెట్ నాలుగు రోజులు, ఐసెట్ రెండు రోజులు, ఈసెట్, ఎడ్ సెట్, లాసెట్, పీజీఎల్ సెట్ ఎగ్జామ్స్ ఒక్కో రోజు నిర్వహించనున్నారు. పీఈ సెట్ ఎగ్జామ్ నాలుగు రోజుల పాటు ఫిజికల్ టెస్టులు చేయనున్నారు. ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు, డిటెయిల్డ్ షెడ్యూల్‌‌‌‌ త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.