- హరీశ్, తలసానిపై ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: చేపపిల్లల పంపిణీ పేరిట మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ రూ.950 కోట్లు దోచుకున్నారని ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆరోపించారు. గురువారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పదేండ్లలో ఎన్ని చెరువుల్లో ఎన్ని చేపపిల్లలు వేశారో లెక్కలు కూడా చెప్పడం లేదన్నారు. ఇందులో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణ సాగుతున్నదని, ఈ ఇద్దరు నేతలు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. రొయ్య పిల్లల పంపిణీలోను ఈ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
సిద్దిపేట, మల్లన్న సాగర్ చెరువుల్లో ఎన్ని చేప పిల్లలు వేశారనే దానిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. పెద్దమ్మ గుడిలో లేదంటే సిద్దిపేటలోని కాలేజీ గ్రౌండ్ లో చర్చకు ఎక్కడైనా తాను సిద్ధమన్నారు. చెరువుల్లో వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా చేప పిల్లలను వేయడంతో అవి మరణించాయని, కాని తాము అలా చేయకుండా చెరువు వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని అందుకు అనుగుణంగా చేప పిల్లలను వేస్తున్నామన్నారు.