
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు రూ. 2.61 కోట్ల కేటాయింపు
- ఈ యేడు పూర్తిగా మహిళలకే అవకాశం
- మీసేవా ద్వారా అప్లికేషన్ల స్వీకరణ
- గ్రామ కమిటీల ద్వారా లబ్దిదారుల ఎంపిక
పెద్దపల్లి, వెలుగు: వ్యవసాయంలో మిషనరీని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆగిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం తిరిగి ప్రారంభించింది. ఈనెల 23 నుంచి అర్హులైన లబ్ధిదారుల నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు రూ.2.61కోట్లు కేటాయించింది.
ఇందులో కరీంనగర్ రూ.85 లక్షలు, పెద్దపల్లి జిల్లాకు 58.28 లక్షలు, జగిత్యాలకు రూ.65 లక్షలు, రాజన్నసిరిసిల్ల జిల్లాకు రూ.50 లక్షలు కేటాయించారు. ఈ యేడు పూర్తిగా మహిళలకే అవకాశం ఇవ్వనున్నారు. ఈ స్కీంను 2018లో గత సర్కార్ నిలిపివేసింది. కానీ రైతుల నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేక 2021–22 ఆర్థిక ఏడాదిలో బడ్జెట్లో నిధులు కేటాయించినా అది కాగితాలకే పరిమితమైంది. ఒక్క రూపాయి కూడా స్కీం అమలుకు ఉపయోగించలేదు. ప్రస్తుతం ప్రభుత్వం మళ్లీ ఈ స్కీంను ప్రారంభిస్తుండడంతో ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న ఆశావహులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మహిళలకే ప్రాధాన్యం..
వ్యవసాయ యాంత్రీకరణ దేశవ్యాప్తంగా పెరిగిపోయిన నేపథ్యంలో గతంలో రాష్ట్రంలోనూ సబ్సిడీపై వ్యవసాయం యంత్రాలు పంపిణీ చేసేవారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్ హయాంలో ఈ పంపిణీ నిలిచిపోయింది. ఈక్రమంలో సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బడ్జెట్‌లో వ్యవసాయ యాంత్రీకరణకు నిధులు కేటాయించింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యంత్రాలను అందజేయనున్నారు. అర్హులైన మహిళలు మీసేవ ద్వారా ఈ నెల 23 నుంచి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు. అనంతరం గ్రామ కమిటీలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
ట్రాక్టర్లు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు వంటి యంత్రాలను సబ్సిడీపై అందజేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు 40 నుంచి 50 శాతం సబ్సిడీపై అందించనున్నారు. గతంలో లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ ప్రమేయం ఎక్కువగా ఉండేది. ఎమ్మెల్యేలు, మంత్రులు సిఫారసు చేసిన వారికే ట్రాక్టర్లు మంజూరు చేసేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి సిఫారసులు లేకుండా అర్హులకే అందజేస్తామని చెప్తుంది..
వానకాలానికి ముందే యంత్రాల అందజేత
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయ యాంత్రీకరణ కోసం ఉమ్మడి జిల్లాకు కేటాయించిన యంత్రాలను వచ్చే వానకాలంలోపే లబ్ధిదారులకు అందజేయనున్నారు. దీంతో ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం గ్రామ కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి చేసి వానకాలంలోపే అందించడానికి అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.
ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగవుతుంటాయి. ఈ యేడు లబ్ధిదారులకు బ్యాటరీ స్ప్రేయర్స్, పవర్ స్ప్రేయర్స్, డ్రోన్ రోటోవేటర్, సీడ్ కమ్ఫర్టిలైజర్డ్రిల్, కల్టివేటర్, బండ్ఫార్మర్, పవర్వీడర్, బ్రష్కట్టర్, పవర్ టిల్లర్, స్ట్రా బాలర్స్ వంటివి అందజేయనున్నారు.