
- వేతనాలకు రూ.1,625 కోట్లు, మెటీరియల్ కంపోనెంట్కు రూ.1,083 కోట్లు
- పనిదినాలు పెంచాలని కేంద్రానికి లేఖ రాసే యోచనలో మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో ఏ పనులు చేపట్టాలన్న దానిపై పంచాయతీరాజ్ శాఖ ప్రణాళికలు రూపొందించింది. జిల్లాలవారీగా ఉపాధి హామీ పనులు, వర్క్ ప్లాన్ ను సిద్ధం చేసింది. అందుకు సంబంధించిన ఫైల్ పై మంత్రి సీతక్క సోమవారం సంతకం చేశారు. ఈ ఏడాది ఉపాధి హామీ పథకం కోసం రూ.2,708.3 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయగా.. అందులో రూ.1,625 కోట్లు వేతనాలు, రూ.1,083 కోట్లు మెటీరియల్ కంపోనెంట్ కోసం కేటాయించనున్నారు.
నిధులు దుర్వినియోగం కాకుండా పక్కా మానిటరింగ్ చేయడంతో పాటు పనిదినాల టార్గెట్ ను చేరేలా ప్లాన్ చేస్తున్నారు. కాగా.. కేంద్రం రాష్ట్రానికి ఈ ఏడాది 6.5 కోట్ల పని దినాలు కేటాయించింది. మహిళా శక్తి ఉపాధి భరోసా, పొలంబాట, ఫలవనాలు, వనమహోత్సవం, జలనిధి, రూరల్ సానిటేషన్, మౌలిక సదుపాయాల కల్పన తదితర పనులు చేపట్టేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఇక, రాష్ట్రంలోని 32 జిల్లాలకు పనుల వారీగా నిధులు కేటాయించింది. ఇందులో నల్లగొండకు 158.7 కోట్లు, వికారాబాద్ జిల్లాకు రూ.140 కోట్లు, సూర్యాపేట జిల్లాకు రూ.13.1 కోట్లు కేటాయించింది. అతి తక్కువగా ములుగు జిల్లాకు కేటాయింపులు జరిగాయి. ములుగు చిన్న జిల్లా కావడంతో తక్కువ నిధులు మంజూరయ్యాయి. ఈ జిల్లాకు రూ.41.2 కోట్లు కేటాయించింది. మేడ్చల్ జిల్లాలోని గ్రామాలు సిటీలో కలువడంతో ఉపాధి కింద నిధులు కేయించలేదు.
పనిదినాలు కుదించిన కేంద్రం
గతేడాది కన్నా ఈసారి కేంద్రం 1.5 కోట్లకు పనిదినాలను కుదించింది. నిరుడు 8 కోట్ల పనిదినాలు కేటాయించగా.. ఈసారి 6.5 కోట్ల పనిదినాలకే పరిమితం చేసింది. ఈ పనిదినాలకు అనుగుణంగా కేంద్రం నిధులు మంజూరు చేయనుంది. నిరుడు డిమాండ్ అధికంగా ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం 12 కోట్ల పనిదినాలు పూర్తి చేసింది. కానీ, ఈ ఏడాది కేవలం 6.5 కోట్ల పనిదినాలు కేటాయించింది. అంతకు మించి పనులు చేయరాదని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.