
- ఒక్కో బావి తవ్వకానికి రూ.2 నుంచి రూ.3 లక్షలు
- పశువుల పాకలు, గొర్రెల షెడ్లు నిర్మాణానికీ నిధులు
- ఒక్కో నిర్మాణానికి రూ. 3 నుంచి రూ.4 లక్షలు
- 2025-26 ఏడాదికి రూ.4,960 కోట్లతో పనులు
హైదరాబాద్, వెలుగు : ఉపాధి హామీ పథకంలో అగ్రి యూనిట్లకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నది. 2025–-26 ఆర్థిక సంవత్సరానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రూ.4,960 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో రూ.2,976 కోట్లు కూలీల వేతనంపై వెచ్చించనున్నది. రూ.1,984 కోట్లు మెటీరియల్ కాంపొనెంట్ పనులకు ఖర్చు చేయనున్నది. ఈసారి ఉపాధి హామీలో వ్యవసాయ బావుల తవ్వకం, పశువుల పాకలు, గొర్రెలు, కోళ్ల షెడ్లు, పొలం బాటలు, పండ్లతోటలు, చెక్ డ్యాంలు, ఊట కుంటలు, బోర్ వెల్ రీచార్జి తదితర పనులు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించింది.
గ్రామాల్లో కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి అధికారులకు రైతులు దరఖాస్తు చేస్తుకుంటే.. గ్రామసభలో పనుల కోసం తీర్మానాలు చేసి రైతులను ఎంపిక చేస్తారు. ముఖ్యంగా రైతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 540 వ్యయసాయ బావులు నిర్మించనున్నారు. ఒక్కో బావికి రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు కేటాయించనున్నారు.
అలాగే 5,400 పశువుల కొట్టాలు, గొర్రెల షెడ్లు నిర్మించాలని లక్ష్యం పెట్టుకోగా.. ఒక్కో నిర్మాణానికి రూ.3 నుంచి రూ.4 లక్షలు మంజూరు చేయనున్నారు. 10,800 పచ్చిరొట్ట ఎరువుల పిట్ల నిర్మాణం, 5,400 వర్మీ కంపోస్ట్ తయారీ కోసం తోట్ల నిర్మాణాలకు ఉపాధి హామీ నిధులు మంజూరు చేశారు. అంతేకాకుండా, స్వయంసహాయక సంఘాల మహిళలకు మదర్ యూనిట్స్ లో భాగంగా 540 కోళ్ల షెడ్లను నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.16.20 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో మండలానికి ఒకటి చొప్పున కోళ్ల షెడ్డు కట్టనున్నారు. ఒకరోజు వయస్సున్న కోడిపిల్లలను 4 నుంచి 5 వారాల వరకు పెంచి విక్రయించనున్నారు. తద్వారా మహిళా సంఘాలకు ఆదాయం సమకూరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
పొలాలకు బాటలు..
రాష్ట్రవ్యాప్తంగా రూ.192 కోట్లతో పొలాలకు బాటలు వేస్తున్నారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గానికి సుమారు రూ.2 కోట్లు కేటాయించారు. దాదాపు 1,920 కిలోమీటర్ల మేర పొలాలకు బాటలు వేయాలన్న లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. దీంతో రైతులు తమ పొలాలకు ఎరువులు, విత్తనాలను తరలించడంతోపాటు పండించిన పంట ఉత్పత్తులను సులభంగా మార్కెట్ కు తరలించవచ్చు.
గతంలో పొలాలకు బాటలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీటి నిర్మాణంతో కర్షకుల కష్టాలు తీరనున్నాయి. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా 2,700 ఎకరాల్లో పండ్లతోటల పెంపకానికి రూ.16.20 కోట్లు కేటాయించారు. రూ.348 కోట్ల నిధులతో నర్సరీల ద్వారా ప్రభుత్వం కోటి ఈత మొక్కలను పెంచనుంది. ప్రతి నర్సరీలో 1,000 ఈతమొక్కలు పెంచాలని టార్గెట్ పెట్టుకున్నది. వచ్చే ఏడాది నాటికి గీత కార్మిక సొసైటీలు, గౌడ కులస్తులకు వాటిని అందించనున్నారు.
వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ‘జలనిధి’
భూగర్భజల వనరులను ఒడిసిపట్టేందుకు ప్రభుత్వం ‘జలనిధి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో రూ.204 కోట్లు కేటాయించింది. ప్రతి నియోజకవర్గానికి సుమారు రూ.2 కోట్లు మంజూరు చేసింది. అంతేకాకుండా 540 చెక్ డ్యాంలు, 2,700 ఊట కుంటలు, 2,700 ఫామ్ పాండ్లు, 1080 బోర్ వెల్ రీచార్జి గుంతలను నిర్మించనున్నారు. ప్రతి నియోజకవర్గానికి సుమారు రూ.5 కోట్లతో 5,400 వ్యక్తిగత ఇంకుడు గుంతలు, రూ.11 కోట్ల నిధులతో 540 బాలికలకు మరుగుదొడ్లు, రూ.320 కోట్ల నిధులతో 540 కిలోమీటర్ల ఇంటర్నల్ సిమెంటు కాంక్రీటు రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.