ఆ 135 మంది స్టూడెంట్లకు నీట్ కౌన్సెలింగ్​కు చాన్స్

ఆ 135 మంది స్టూడెంట్లకు నీట్ కౌన్సెలింగ్​కు చాన్స్
  • రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతో ఈ ఒక్కసారికి అవకాశం
  • స్థానికత వ్యవహారంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు 

న్యూఢిల్లీ, వెలుగు: స్థానికత వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించిన 135 మంది స్టూడెంట్లు నీట్ కౌన్సెలింగ్ కు హాజరయ్యేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కౌన్సెలింగ్ సమయం తక్కువగా ఉన్నందున ఈ ఒక్కసారికి అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టు సుప్రీంకోర్టుకు సర్కార్ చెప్పింది.

ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం.. 135 మంది విద్యార్థులు ఈ ఏడాది నీట్ కౌన్సెలింగ్ కు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జీవో 33ని తీసుకొచ్చింది.

నీట్ ఎగ్జామ్​కు ముందు నాలుగేండ్లు లోకల్ గా చదవాలని, స్థానికుడై ఉండాలని అందులో నిబంధన చేర్చింది. దీన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ కు చెందిన కల్లూరి నాగనరసింహ అభిరామ్ తో పాటు మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు.. విద్యార్థులకు అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 11న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దానిపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. 

ఈ ఒక్కసారికే మినహాయింపు.. 

తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. నీట్ లో స్థానికతకు సంబంధించి ప్రతి విద్యార్థి స్థానికుడై ఉండాలని.. 9, 10 తరగతులు, ఇంటర్ రాష్ట్రంలో చదివి ఉండాలని చెప్పారు. దీనికి సంబంధించి రాజ్యాంగ ధర్మాసనంతో పాటు నాలుగు తీర్పులు తమకు అనుకూలంగా ఉన్నాయని కోర్టుకు నివేదించారు. ‘‘తెలుగు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కొందరు తమ స్కూల్‌‌, కాలేజీ స్టడీస్ విదేశాల్లో పూర్తి చేశారు. కానీ నీట్ ఎగ్జామ్ కు తెలంగాణ లో హాజరయ్యారు. దీంతో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నది” అని తెలిపారు.

దీనిపై విద్యార్థుల తరఫు న్యాయవాది మురళీధర్ అభ్యంతరం తెలిపారు. కేవలం నీట్ రిజల్ట్స్ కు వారం ముందే తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవో తెచ్చిందన్నారు. ఈ వాదనలపై సింఘ్వీ జోక్యం చేసుకుని.. ‘‘పదేండ్ల ఉమ్మడి కోటా 371(డి) పూర్తయింది. ఆ తర్వాతే ప్రభుత్వం కొత్త రూల్ తెచ్చింది. అయితే ఈ ఒక్కసారికి విద్యార్థులకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. సెప్టెంబర్ చివరి వారంలో తొలి, అక్టోబర్ ఫస్ట్ వీక్ లో రెండో విడత కౌన్సిలింగ్ ఉన్నందున.. విద్యార్థుల మేలుకోరి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది” అని తెలిపారు.

ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిన నేపథ్యంలో కోర్టును ఆశ్రయించిన 135 మంది విద్యార్థులు నీట్ కౌన్సెలింగ్ కు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో సమాధానం చెప్పాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, వచ్చే నెల 13న ఈ పిటిషన్ పై మరోసారి విచారణ జరగనుంది.