ఎల్ఆర్ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ.. సర్కారు నిర్ణయంపై దరఖాస్తుదారుల్లో హర్షం

 ఎల్ఆర్ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ.. సర్కారు నిర్ణయంపై దరఖాస్తుదారుల్లో హర్షం
  • వనపర్తి జిల్లాలో 47,846 అప్లై
  • 25 శాతం రాయితీ ఇచ్చే అవకాశం!

వనపర్తి, వెలుగు: తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్​పై తీసుకున్న నిర్ణయంతో అనధికారిక లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనధికార లేఔట్లలోని ప్లాట్లను రెగ్యులరైజేషన్​ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్​లో రెవెన్యూ మంత్రితో కలిసి మున్సిపల్​ శాఖ అధికారులతో సీఎం రేవంత్​రెడ్డి సమావేశం నిర్వహించారు. 

ఎల్ఆర్ఎస్​ చేసుకునే వారికి 25 శాతం రాయితీ ఇచ్చి వన్​ టైమ్​ సెటిల్ మెంట్​ కింద క్రబద్దీకరించుకునేలా అవకాశమివ్వాలని నిర్ణయించారు. వనపర్తి జిల్లాలో ఎల్ఆర్ఎస్​  కింద దరఖాస్తు చేసుకున్న 47,846 మంది రెగ్యులరైజేషన్​ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారు ఊరట చెందుతున్నారు.

ఐదేండ్లుగా ఎదురుచూపులు..

అక్రమ లేఔట్లలో ప్లాట్లను కొనుగోలు చేసిన వారు, వాటిని క్రమబద్దీకరించుకునేందుకు వెంటనే రూ.1000 చార్జీగా చెల్లించాలని 2020లో అప్పటి ప్రభుత్వం చెప్పడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికీ వాటిని క్రమబద్దీకరించ లేదు. నిరుడు ఆగస్టు మొదటివారంలో అప్లికేషన్ల పరిశీలన ప్రారంభిస్తున్నట్లు ప్రకటించినా ఇప్పటి వరకు ఎటూ తేల్చలేదు.

సమస్య తీరేనా?

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పునర్​ వ్యవస్థీకరణలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. దీంతో జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో సైతం వెంచర్లు వెలిశాయి. పొలాలను కొన్న రియల్టర్లు​వాటిని వెంచర్లుగా మార్చి ప్లాట్లు చేసి అమ్మారు. జిల్లాల ఏర్పాటుకు ముందు చేసినవి కూడా ఉన్నాయి.  వీటిలో పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లకు అక్కరకు వస్తాయని ఆలోచించి మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగులు ప్లాట్లను కొనుగోలు చేశారు. ఎల్ఆర్ఎస్​తో లింక్​ పెట్టడంతో వాటిని అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారు. 

దరఖాస్తుల ద్వారా రూ.4.78 కోట్ల ఆదాయం

ఎల్ఆర్ఎస్​ కోసం గత ప్రభుత్వం విధించిన గడువులోగా క్రమబద్దీకరణకు 47,864 మంది రూ.వెయ్యి చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.4.78 కోట్ల ఆదాయం సమకూరింది. వనపర్తి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, ప్రధాన ప్రాంతాల్లో కలిపి ఈ మొత్తం జమ​అయ్యాయి. అధికారులు అంచనా వేసిన దాని కంటే ఎక్కువగా దరఖాస్తులు రావడంతో ఎల్ఆర్ఎస్​  ద్వారా మంచి ఆదాయం వస్తుందని భావించారు. 

ఇదిలాఉండగా అనధికార వెంచర్లలో రెండో రిజిస్ట్రేషన్ కు వెసులుబాటు ఇవ్వడంతో కొందరు ఇల్లీగల్​గా క్రయవిక్రయాలు జరిపి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఈ ఇల్లీగల్​ రిజిస్ట్రేషన్ల వ్యవహారం ప్రభుత్వం దృష్టికి పోవడంతో.. తాజాగా వన్​ టైమ్​ సెటిల్​మెంట్​ కింద ఎల్ఆర్ఎస్​ చేయాలని నిర్ణయం తీసుకుంది. 

మున్సిపాలిటీవారీగా దరఖాస్తులు​


అమరచింత        449

ఆత్మకూరు           3,812

పెబ్బేరు               7,242

కొత్తకోట                7,580

వనపర్తి                 28,763