
- హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: వక్ఫ్ బోర్డు సీఈవో నియామకానికి చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. నియామకానికి ఎంత సమయం పడుతుందో మార్చి 12లోగా పూర్తి వివరాలు సమర్పిస్తామని చెప్పింది. వక్ఫ్ బోర్డు సీఈవోను తొలగించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ, వక్ఫ్ బోర్డు సీఈవో అసదుల్లా, సయ్యద్ అజ్మతుల్లా అప్పీలు దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ అభినంద కుమార్ షావిలి, జస్టిస్ తిరుమలాదేవిల ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది.
అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సీఈవో నియామకానికి చర్యలు చేపడతామని, సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని కోరారు. అందుకు హైకోర్టు, అనుమతించింది. వక్ఫ్ బోర్డు సీఈవోను వెంటనే తొలగించాలన్న ఉత్తర్వుల అమలునూ నిలిపివేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాధులైన మహమ్మద్ అక్బర్, జహంగీర్ ఖాన్‌కు నోటీసులు జారీ చేస్తూ.. విచారణను మార్చి 12కు వాయిదా వేసింది.