- ఇటీవల కలెక్టరేట్‌లో రివ్యూ చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు
- పోతారం లిఫ్టు పూర్తిచేయాలని మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశాలు
- గుంటిమడుగు ప్రాజెక్టును కూడా చేపట్టాలని రైతుల వినతి
- 2004 నుంచి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఆదివారం పెద్దపల్లి కలెక్టరేట్‌లో పెండింగ్ ప్రాజెక్టులపై మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులతో రివ్యూ చేశారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మంథని, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో పోతారం లిప్టు, గుంటిమడుగు రిజర్వాయర్ నిర్మించేందుకు 2004లో అప్పటి సర్కార్ నిర్ణయించింది. అప్పటినుంచి నేటివరకు ఈ ప్రాజెక్టులపై అడుగు ముందుకు పడలేదు.
తెలంగాణ వచ్చాక పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో వీటిని పక్కన పెట్టారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ పెండింగ్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టింది. గతంలో పోతారం లిఫ్ట్ పూర్తిచేయాలని ఆందోళన చేసిన రైతులకు సర్కార్ తాజా నిర్ణయంతో ఆశలు చిగురుస్తున్నాయి. దీంతోపాటు గుంటిమడుగు రిజర్వాయర్‌ను కూడా పూర్తి చేసి సాగునీటికి ఇబ్బంది లేకుండా చేయాలని కోరుతున్నారు.
పోతారం లిఫ్ట్ కోసం రైతుల ఆందోళనలు
దశాబ్దాల నుంచి గోదావరిపైన ఆరెంద, పోతారం, ఉప్పట్ల వద్ద లిఫ్ట్‌లు పెట్టాలనే డిమాండ్ ఉంది. నాటి నుంచి రైతులు లిఫ్ట్‌ల కోసం ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. గత సర్కార్ గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం.. మంథని తలాపునే ఉన్నా నియోజకవర్గంలోని చాలా గ్రామాల ఆయకట్టుకు సాగునీరు అందించలేకపోయింది. సాగునీరు అందాలంటే లిఫ్ట్ పథకాలు పూర్తిచేయాలని రైతులు సర్కార్‌ను కోరుతున్నారు.
గతంలో గుండారం రిజర్వాయర్ నుంచి వచ్చే ఎల్ సిక్స్ కెనాల్ ద్వారా చివరి ఆయకట్టు వేల ఎకరాలకు నీళ్లు వచ్చేవి. సింగరేణి ఓసీపీల విస్తరణతో రామగిరి మండలంలో ఎల్ సిక్స్ కెనాల్ పూర్తిగా ధ్వంసమైంది. అనంతరం కొత్తగా మరో కెనాల్ నిర్మించినా రిపేర్లతో పక్కకుపోయింది. దీంతో మంథని మండలంలోని వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు. ఈక్రమంలో పోతారం లిఫ్ట్‌ను పూర్తిచేయాలని మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించినట్లు తెలుస్తోంది.
టెయిల్ ఎండ్ రైతులకు లబ్ధి
గోదావరిలోకి వృథాగా పోతున్న నీటిని వినియోగంలోకి తీసుకురావడంతో ఎస్‌ఆర్‌ఎస్పీ టెయిల్ఎండ్ రైతులకు సాగునీటిని అందించేందుకు గుంటిమడుగు రిజర్వాయర్ నిర్మించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. రెండు గుట్టల మధ్య 400 మీటర్ల పొడవుతో 5 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించాలని ప్రతిపాదించారు. ఎలాంటి ముంపు లేకుండా మానేరులో దాదాపు 9 కి.మీ, హుస్సేన్‌మియా వాగులో మరో 9 కి.మీ మేర నీరు నిల్వ చేసుకోవచ్చు.
ఈ రిజర్వాయర్ ద్వారా కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, మంథని, ముత్తారం మండలాలు, కరీంనగర్ జిల్లా జమ్మికుంట, హుజూరాబాద్‌లతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చాలా గ్రామాలకు సాగునీరందుతుంది. ఎల్ఎండీ, మిడ్‌మానేరు, ఎస్‌ఆర్‌ఎస్పీ కెనాల్స్, హుస్సేన్‌మియా, నక్కలవాగు, చలివాగు, శ్రీరామసరోవర్ గుట్టల నుంచి పారే నీరు ఏటా సుమారు 150 టీఎంసీలు మానేరులో కలిసి వృథాగా పోతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కొంతమేరనైనా నీటిని నిల్వచేసి సాగుకు నీరందించొచ్చని రైతులు భావిస్తున్నారు.