సాండ్​ పాలసీ మార్పుపై సర్కార్ ​ఫోకస్!​

సాండ్​ పాలసీ మార్పుపై సర్కార్ ​ఫోకస్!​
  • సాధ్యసాధ్యాలపై అధ్యయనం
  • సింగిల్ ​టెండర్​ విధానానికి సమాలోచనలు
  • ఇసుక అమ్మకాల్లో అక్రమాల ఆరోపణలతో ఈ నిర్ణయం 
  • వ్యతిరేకిస్తున్న ఆదివాసీ సంఘాలు

భద్రాచలం, వెలుగు :  భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో సాండ్​ పాలసీ మార్పునకు సాధ్యసాధ్యాలపై సర్కారు అధ్యయనం చేస్తోంది. సింగిల్​ టెండర్​ విధానానికి సమాలోచనలు చేస్తోంది. ఇసుక తవ్వకాలు, రవాణా, అమ్మకాల్లో అక్రమాలపై ఆరోపణలు వస్తున్న వేళ సర్కార్​ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతంలో ఇటీవల మైనింగ్, టీజీఎండీసీ ఇతర ఆఫీసర్లతో కూడిన బృందం చర్ల మండలంలో ఇసుక ర్యాంపులను పరిశీలించింది. కాగా పాలసీ మార్పును ఆదివాసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. 

2014లో ఇసుక పాలసీ.. 

తెలంగాణ సర్కారు 2014లో ఇసుక పాలసీని తీసుకొచ్చింది. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ సొసైటీల ఆధ్వర్యంలో పీసా చట్టం ప్రకారం ఇసుక ర్యాంపులను నిర్వహించే అధికారాలను కల్పించింది. రైజింగ్​ కాంట్రాక్టర్ల పేరుతో గిరిజనేతరులు పెట్టుబడులు పెట్టి సొసైటీల్లోకి చొరబడ్డారు. అధికారుల అండదండలతో అనేక అక్రమాలకు తెరలేపి కోట్లకు పడగలెత్తారు. జీరో వ్యాపారం, ఓవర్​ లోడింగ్, నకిలీ వేబిల్లుల దందాతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపెడుతున్నారు. దీనికి ఉదాహరణ ఇటీవల లారీ ఓనర్స్ అసోషియేషన్​ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాశారు. 

క్వారీల్లో ఇసుక నింపుకొనేందుకు ఒక్కో ట్రిప్పునకు లారీ డ్రైవర్ల నుంచి రూ.2500, ఓవర్​ లోడ్​ చేస్తూ రూ.12వేలు రేజింగ్​కాంట్రాక్టర్లు వసూలు చేస్తున్నారు. రోజూ రూ.2.30కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండి పెడుతున్నారని ఆ లేఖలో పేర్కొనడం విశేషం. సింగరేణి తరహాలో ఎంటీ కాంటా పెట్టి లోడింగ్​చేసినట్లుగా ఇసుక రవాణాలో కూడా ఇదే పద్ధతిని అనుసరించాలని లారీ ఓనర్స్ అసోషియేషన్ వేడుకుంది. ఇలాంటి అక్రమాల నేపథ్యంలో సాండ్​ పాలసీలో మార్పునకు సర్కారు ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

సింగిల్​ టెండర్ విధానంతో తలనొప్పులే..

సింగిల్​ టెండర్​ విధానం ద్వారా సాండ్​ పాలసీలో మార్పులకు సర్కారు శ్రీకారం చుట్టడం వల్ల తలనొప్పులే ఎదురవుతాయి. ఆంధ్రాలో గత ప్రభుత్వం ఇదే విధానం అమలు చేస్తే కాంట్రాక్టరు అడ్డగోలుగా తోలి ప్రభుత్వ ఖజానాకు కనీసం డబ్బులు జమ చేయలేదు. దీనిపై కోర్టులో అక్కడి సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో లారీ ఓనర్లకు ఉపాధి పోతుంది. దీని బదులు రైజింగ్​ కాంట్రాక్టర్ల వ్యవస్థను రద్దు చేసి ఏజెన్సీ ఏరియాల్లో ట్రైకార్​ ద్వారా సొసైటీలకు రుణాలు ఇప్పించి, ఐటీడీఏల పర్యవేక్షణలో ఇసుక ర్యాంపులను నిర్వహిస్తే ఆదివాసీలకు మేలు కలుగుతుంది. ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. గత పాలసీ ద్వారా సర్కారుకు ఏడాదికి రూ.1000కోట్ల మేర ఆదాయం వచ్చింది. 

సొసైటీల పొట్టకొట్టవద్దు

ఆదివాసీ సొసైటీల పొట్టకొట్టే ప్రయత్నం చేయొద్దు. అధికారులతో కుమ్మక్కై రైజింగ్​ కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడితే ఆదివాసీ సొసైటీకి నష్టం కల్గించేలా నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదు. అక్రమాలను అరికట్టి ఆదివాసీలకు ఉపాధి కల్పించేలా విధాన నిర్ణయాలు తీసుకోవాలి. 

ఇర్పారాజు, ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక నాయకుడు