మహిళల ఆకాంక్షలు నెరవేరేదెప్పుడు...మహిళల హక్కుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వలేదు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్13న మహిళా సంక్షేమ దివాస్​గా ప్రభుత్వం ప్రకటించి సంబరాలకు సిద్ధమైంది. మహిళల సంక్షేమం సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వారికి ఇచ్చే ప్రాధాన్యతలోనే ఉంటుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మహిళలు కీలక పాత్ర పోషించారు. తెలంగాణ జేఏసీ ఇచ్చిన ఉద్యమ పిలుపుల్లో పురుషులతో దీటుగా పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో తమ ఆశలు, ఆకాంక్షలు నెరవేరుతాయని ఆశించారు. కానీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళల హక్కుల రక్షణకు ప్రభుత్వం ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించిన మహిళా కమిషన్​ను ఏర్పాటు చేయడానికి మహిళా సంఘాలు తిరిగి ఉద్యమించాల్సి వచ్చింది. 

కనీసం రాజకీయ రంగంలోనైనా మహిళలకు తగిన పాత్ర ఇస్తారని ఆశించినా, అది కూడా ఆశాభంగం అయింది. మహిళా మంత్రిత్వ శాఖ కూడా పురుషుడికి ఇచ్చిన ఘనత మన కేసీఆర్ ది. ఆ తర్వాత ఎన్నో నిరసనల తర్వాత రెండోసారి ఎన్నికైన క్యాబినెట్​లో ప్రభుత్వం ఇద్దరికి మాత్రమే చోటు ఇచ్చింది. ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా మహిళలకు కేటాయించిన సీట్లు కూడా నాలుగు మాత్రమే. అలాంటి పార్టీకి ప్రాతినిధ్య వహించే కవితకు మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది? రాబోయే ఎన్నికల్లో మహిళ ఓటర్లకు గాలం వేయడం, అలాగే తమ లిక్కర్ స్కామ్ ను పక్కకు పెట్టి ప్రజల్లో, మహిళల్లో సానుభూతి పొందడానికే  మహిళా రిజర్వేషన్ల కోసం ఆమె ఆందోళన చేశారు తప్ప అందులో చిత్తశుద్ధి లేదు.

మహిళా ఉద్యోగులను పర్మినెంట్​చేయలేదు..

రాష్ట్రంలో 95 శాతం మహిళలు అసంఘటిత రంగంలోనూ కాంట్రాక్ట్ కార్మికులుగా కొనసాగుతున్నారు. ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) ఆధ్వర్యంలో 2011లో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పార్లమెంటు ముందు ధర్నా నిర్వహించినప్పుడు సాక్షాత్తు కేసీఆర్ పాల్గొని కాంట్రాక్టు కార్మికులుగా ఉన్న మహిళలందరినీ పర్మినెంట్ కార్మికులుగా చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అంగన్వాడీ, ఆశా వర్కర్లు, హాస్పిటల్లో నర్సులు, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, యూనివర్సిటీల్లో పనిచేస్తున్న మహిళా కార్మికులు ఎవరిని కూడా పర్మినెంట్ చేయలేదు. వీరికి సమాన పనికి సమాన వేతనం చెల్లించడం లేదు. నేటికీ వారు చాలీచాలని జీతాలతో కొనసాగుతున్నారు. రేషన్ షాపుల ద్వారా ఒక్క బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదు. పెరుగుతున్న కొత్త కుటుంబాలకు రేషన్ కార్డులను కూడా ఇవ్వలేదు. 

మద్యంతో పెరుగుతున్న నేరాలు

పెరుగుతున్న ధరల ప్రభావం మహిళలపై తీవ్రంగా ఉంది. సరైన ఆహారం అందక తల్లీ పిల్లలు రక్తహీనత లాంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. మహిళా సాధికారత కళ్యాణ లక్ష్మి, గర్భిణులకు కిట్స్​ ద్వారానే అందుతుందా?  అన్ని రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పించడం,  విద్యా, ఉద్యోగ, జీవనంలో మెరుగుదలకు కృషి చేయాలి.  రాష్ట్రంలో మహిళలపై హింస పెరుగుతున్న విషయం ఎన్సీఆర్బీ నివేదికల్లో స్పష్టమవుతున్నది. 

దాన్ని ఆపడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రభుత్వం ఆలోచించడం లేదు. స్త్రీలపై అత్యాచారాలు, వేధింపులు పెరుగుతున్నాయి. దీనికి కారణం అవుతున్న మద్యం అమ్మకాలను సర్కారు నియంత్రించకపోగా, పెంచి ఆదాయం సంపాదిస్తున్నది. యువతను మత్తులో ముంచుతూ మహిళలపై హింసను ప్రోత్సహించే విధానాలను అనుసరిస్తున్నది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మహిళా చట్టాలు అమలవుతున్న తీరును, మహిళల సంక్షేమాన్ని, వారికి ఇచ్చే సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రాధాన్యతను గురించి ప్రభుత్వం ఆలోచించాలి.

 జి. ఝాన్సీ  రాష్ట్ర అధ్యక్షురాలు,  ప్రగతిశీల మహిళా సంఘం