ఆ ఐదు పంచాయతీల్లో ఎన్నికల్లేవ్!

ఆ ఐదు పంచాయతీల్లో ఎన్నికల్లేవ్!

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఆఫీసర్లు రంగం సిద్ధం చేస్తున్నారు. కానీ జిల్లాలోని ఐదు పంచాయతీల్లో ఇప్పట్లో ఎన్నికల్లేవని గవర్నమెంట్ స్పష్టం చేసింది. టెంపుల్ సిటీ భద్రాచలాన్ని మూడు ముక్కలుగా, సారపాకను రెండుగా చేసిన బీఆర్ఎస్ సర్కార్ తీరుతో ఆ ఐదు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన తప్పులను సరిదిద్దేయత్నం చేసినా పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న క్రమంలో ఆ ఐదు పంచాయతీలకు ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం లేదని ఆఫీసర్లు స్పష్టం చేశారు. 

మూడు విడతల్లో ఎన్నికలు..

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఆఫీసర్లు సన్నాహాలు చేస్తున్నారు. మొదటి విడతలో భద్రాచలం డివిజన్​లో, రెండు విడత కొత్తగూడెం డివిజన్​లోని ఏడు మండలాల్లో, మూడో విడతలో మిగిలిన ఏడు మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలో 484 పంచాయతీలలో ఓటరు జాబితాను రూపొందిస్తున్నారు. అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు.

కానీ ఐదు పంచాయతీలుగా విభజన జరిగిన భద్రాచలం, సీతానగరం, శాంతి నగరంతో పాటు సారపాక, ఐటీసీ పంచాయతీలలో ఎన్నికలు ప్రస్తుతం లేవని గవర్నమెంట్ నుంచి సంకేతాలు రావడంతో ఆఫీసర్లు ఓటరు జాబితా రూపొందించడం లేదు. 479 పంచాయతీల్లోని 4,232 వార్డులలో ఓటరు జాబితానూ తయారు చేశారు. 479 పంచాయతీల్లో 6,23,940 మంది ఓటర్లున్నట్టు పంచాయతీ ఆఫీసర్లు ప్రకటించారు. పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు.