ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత ఘనత మాది : ఉత్తమ్

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత ఘనత మాది : ఉత్తమ్
  • సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగానే ముందుకెళ్లాం: ఉత్తమ్
  • వర్గీకరణ ప్రయోజనాలు కాపాడేలా చర్యలు తీసుకున్నామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: దశాబ్దాల కాలంగా నిరీక్షిస్తున్న ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అలాంటి చరిత్రాత్మకమైన ఘట్టంలో తన భాగస్వామ్యం ఉండడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా వర్గీకరణకు చట్టబద్ధత కల్పించామన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై అసెంబ్లీలో మంగళవారం ఆయన మాట్లాడారు. ‘‘మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంది. ఇదే అంశాన్ని ప్రధానంగా చేసుకుని 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగింది. అప్పట్లో ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగతో వేదికలు పంచుకున్నాం. 

సుప్రీం కోర్టు ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను శాస్త్రీయ బద్దంగా ప్రణాళికలు రూపొందించి చట్టబద్ధత కల్పించింది. వర్గీకరణ ప్రయోజనాలు కాపాడేలా చర్యలు తీసుకున్నాం. ప్రతి ఎస్సీ ఉప కులానికి సమాన అవకాశాలు రావాలన్న ప్రాతిపదికన నిర్ణయం తీసుకున్నాం. జనాభా, అక్షరాస్యత, ఉపాధి, విద్య, ఆర్థిక స్థితిగతులు, రాజకీయ ప్రాధాన్యత వంటి అంశాలపై 59 ఉప కులాలను సమీక్షించిన తర్వాతే నివేదికకు కమిషన్ తుది రూపం ఇచ్చింది’’అని ఉత్తమ్ అన్నారు. 

మొదటి భాగంలో అత్యధికంగా వెనుకబడిన 15 ఉప కులాల జనాభాను 3.288 శాతంగా గుర్తించి వారికి ఒక్క శాతం రిజ ర్వేషన్, రెండో భాగంలో ఉన్న సాధారణ ప్రయోజనం పొందిన 18 ఉప కులాల జనాభాను 62.74 శాతంగా గుర్తించి 9 శాతం రిజర్వేషన్ అమలుకు కమిషన్ నిర్ణయించిందన్నారు. మూడో భాగంలో ఉన్నవారు రిజర్వేషన్లతో ఎక్కువ శాతం ప్రయో జనం పొందిన 26 కూలాల జనాభా 33.963 శాతంగా గుర్తించి వారికి 5 శాతం రిజర్వేషన్లు ఫిక్స్ చేసిందని తెలిపారు. 2026 జనగణన తర్వాత ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచుతామని వివ రించారు.