
నార్కట్ పల్లి, వెలుగు : రైతుల శ్రేయస్సే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం నార్కట్పల్లి మండలం అమ్మనబోలు, పల్లెపాడు, అక్కెనపల్లి, తొండలవాయి, నెమ్మని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేసిందన్నారు. పెట్టుబడి కోసం రైతు భరోసా అందించడంతోపాటు సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీడీవో ఉమేశ్, కాంగ్రెస్మండల అధ్యక్షుడు ఉషయ్యగౌడ్, నాయకులు పాల్గొన్నారు.
ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం
సూర్యాపేట, వెలుగు : రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని సూర్యాపేట తహసీల్దారు శ్యామ్ సుందర్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట రూరల్ మండలం గాంధీనగర్ లో పీఏసీఎస్పిల్లలమర్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి సూర్యాపేట మండలంలో 37 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో 7 కేంద్రాలు, ఐకేపీ ఆధ్వర్యంలో 23 కేంద్రాలు, మెప్మా ఆధ్వర్యంలో 7 కేంద్రాలు.. మొత్తం 37 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సుధీర్ రావు, తహసీల్దార్ కృష్ణయ్య సూచించారు. చివ్వెంల మండలంలోని చివ్వెంల, పిల్లలజగ్గు తండా, బండమీది చందుపట్ల, తిరుమలగిరి, వల్లభాపురం గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో వట్టి ఖమ్మంపహాడ్, రోళ్లబండ తండా, బద్య తండా, లక్ష్మీనాయక్ తండా, వాల్య తండా, అక్కలదేవిగూడెంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దు..
చండూరు, వెలుగు : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని డీసీసీబీ డైరెక్టర్ కోడి సుష్మావెంకన్న రైతులకు సూచించారు. సోమవారం మండలంలోని కస్తాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకొని మద్దతు ధర పొందాలని చెప్పారు.