ఏఐ పాఠాలపై ఆసక్తి .. ఉమ్మడి జిల్లాలో 101 స్కూళ్లలో అమలు

ఏఐ పాఠాలపై ఆసక్తి  .. ఉమ్మడి జిల్లాలో 101 స్కూళ్లలో అమలు
  • పైలెట్ ప్రాజెక్ట్ గా మెదక్ జిల్లాలో 6 స్కూళ్లలో ప్రారంభం
  • సక్సెస్ కావడంతో మరిన్ని స్కూల్స్​కు విస్తరణ
  • ఏఐ టెక్నాలజీతో విద్యార్ధుల స్కిల్స్ పెంపుదలకు కృషి 

మెదక్ /సంగారెడ్డి/సిద్దిపేట, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించిన ఆర్టిఫిషియల్​ఇంటలిజెన్స్ (ఏ.ఐ.) క్లాసులపై స్టూడెంట్స్ ఆసక్తి చూపిస్తున్నారు. సర్కారు బడి పిల్లల్లో లెర్నింగ్​ స్కిల్స్ పెంపొందించేందుకు ఏఐ టెక్నాలజీని వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్ట్ కింద మొదట మెదక్ జిల్లాలో 6 స్కూళ్లలో ఏఐ క్లాసులు ప్రారంభించింది. ఇది సక్సెస్ కావడంతో మెదక్ జిల్లాలో మరో 15 స్కూల్స్ లో, సంగారెడ్డి జిల్లాలో 33 స్కూళ్లలో, సిద్దిపేట జిల్లాలో 47 స్కూళ్లలో ఏఐ క్లాసులు ప్రారంభించారు. 

ఈ నెల 15 నుంచి ఈ స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్ లు ఏర్పాటు చేసి ఏఐ పాఠాలు చెప్తున్నారు. ఈ క్లాసుల నిర్వహణపై ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతున్నారు. ఎంపిక చేసిన స్కూళ్ల హెచ్ఎంలు, టీచర్లకు రిసోర్స్ పర్సన్ల ద్వారా ట్రైనింగ్ ఇప్పించి, ప్రత్యేకంగా కంప్యూటర్ ల్యాబ్ లు ఏర్పాటు చేశారు. 

ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటున్న పిల్లల్లో ప్రాథమిక స్థాయిలో అభ్యాసన సామర్ధ్యాలు తగ్గడంతో ప్రభుత్వం ఏఐ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. 3 నుంచి 5వ తరగతి వరకు తెలుగు, మాథ్స్​సబ్జెక్టులను స్టూడెంట్స్ ఆసక్తితో నేర్చుకునేలా ఏఐ సాఫ్ట్ వేర్ రూపొందించారు. ఏఐ బోధనతో స్టూడెంట్స్ సామర్ధ్యం మెరుగు పడనుంది. చదువులో వెనుకబడిన స్టూడెంట్స్ ను గుర్తించి వారిమీద ఫోకస్​ పెడతారు. 

ఐదుగురు స్టూడెంట్స్​ ఒక బ్యాచ్​గా ఏఐ క్లాస్​కు హాజరవుతారు. వారికి అర్ధమయ్యేలా పాఠాలు ఉంటాయి. స్టూడెంట్స్ లెసన్స్ అర్థం చేసుకుంటున్నారా లేదా అని ఏఐ గుర్తించి ఒకవేళ అర్థం చేసుకోకపోతే మరింత సులభంగా అర్థమయ్యేలా బోధిస్తుంది. ఏఐ క్లాసుల కోసం ఇప్పటికే ఆయా స్కూళ్లలో ఉన్న కంప్యూటర్లతో పాటు పక్కనున్న హైస్కూళ్ల కంప్యూటర్లను కూడా 
వినియోగిస్తున్నారు. 

ఆసక్తి చూపిస్తున్నారు

ఏఐ క్లాసులు మొదలుపెట్టి వారం రోజులైంది. ఇప్పుడిప్పుడే స్టూడెంట్స్ ఈ క్లాసులపై ఆసక్తి చూపిస్తున్నారు. టెక్ట్స్​ ఇమేజ్ రూపంలో ప్రశ్న, జవాబు జనరేట్ అవుతుండడంతో స్టూడెంట్స్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ క్లాసులు విద్యార్థి మేధస్సును పెంచి సులభంగా నేర్చుకునేలా చేస్తాయి. - సృజన, టీచర్, ముత్తంగి

బాగా అర్థమవుతోంది 

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ క్లాసులు బాగా అర్థమవుతున్నాయి.  ఇంతకుముందు మామూలుగా క్లాసులు చెబితే అర్థమయ్యేవి కావు. ఇప్పుడు ఆ సమస్య లేదు. కంప్యూటర్​లో టెక్ట్స్​ఇమేజ్ ద్వారా చూసి దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను. - జకీయా, 5వ తరగతి, ముత్తంగి