
- ఏటీఎం కార్డు సైజులో ఉండే చాన్స్
- క్యూఆర్ కోడ్, షాప్ నంబర్ కూడా
- సీఎం, పౌరసరఫరా మంత్రి ఫొటోలు
- కుటుంబం ఫొటోనా.. గృహిణి ఫొటో ఒక్కటేనా అనే అంశంపై తర్జన భర్జన
హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల జారీపై పౌరసరఫరాల శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. తొలివిడుతలో లక్ష కార్డులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు ఉగాది కల్లా రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ చేయాలని భావిస్తున్న సర్కారు ఆ మేరకు బియ్యం సేకరించే పనిలో నిమగ్నమైంది.
ఇప్పటికే పలు డిజైన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ శాఖ అధికారులు చూపించారు. కొత్త కార్డులు గృహిణి పేరుతోనే జారీ చేయనున్నారని సమాచారం. ఏటీఏం కార్డు సైజులో ఈ కార్డు ఉంటుందని తెలుస్తోంది. లబ్ధిదారుడి అడ్రస్ క్యూఆర్ కోడ్ తో పాటు, రేషన్ షాప్ నంబర్ కూడా దీనిపై ఉంటుందని సమాచారం. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలతోపాటు ప్రభుత్వ లోగో కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీనిపై కుటుంబం మొత్తం గ్రూప్ ఫొటో ఉండాలా..? లేదా గృహిణి ఫొటో ఒక్కటే ఉండాలా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.